medical treatment: మోయలేని వైద్య చికిత్సల భారం.. పురుషుల్లోనే అధికం
సగటు జీవి ఒక్కసారి అనారోగ్యం బారినపడితే ఆర్థిక భారం తడిసిమోపెడవుతోంది. జీవితాంతం కొద్దోగొప్పో కూడబెట్టిన సొమ్మంతా దవాఖానాల పాలు చేయాల్సి వస్తోంది. అది కూడా సరిపోక అప్పుల పాలు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
telugu states medical billing report
By
Published : Aug 27, 2021, 7:30 AM IST
రాష్ట్రంలో 75.5 శాతం ఖర్చులను దాచుకున్న సొమ్ము నుంచే పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహాలో 52.2 శాతం డబ్బును వెచ్చిస్తున్నారు. ఏపీ గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా 28.2 శాతం మంది అప్పులు తెస్తుండగా.. 23 శాతంతో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. తెలంగాణలో ఇది 16.3 శాతంగా నమోదైంది. మహిళలకంటే పురుషులకు ఆసుపత్రుల బిల్లులు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణంలో మహిళలు ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించడానికి రూ.15,761 ఖర్చు పెడుతుండగా.. పురుషులు రూ.23,395 వ్యయం చేయాల్సి వస్తోంది. అదే తెలంగాణ గ్రామీణంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు మహిళలు రూ.23,590 చెల్లిస్తుండగా.. పురుషులు రూ.26,022 వెచ్చిస్తున్నారు.
2017-18 ఆర్థిక గణాంకాల ప్రకారం.. వైద్యంపై ఖర్చుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 63 శాతం కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 37 శాతంగా నమోదైంది. గత 9 సంవత్సరాల గణాంకాలను పరిశీలించినా ఒక శాతానికంటే కొంచెం హెచ్చుగా ఉన్నది తప్ప.. భారీగా కేటాయింపులు లేవు. జీడీపీలో వైద్యరంగం కోసం వెచ్చిస్తున్నది కేవలం 1.25 శాతం మాత్రమేనని ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2020’ స్పష్టం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో వైద్య ఖర్చుల సమాచారాన్ని పేర్కొంటూ తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ నివేదికను విడుదల చేసింది.
క్యాన్సర్లకు అధిక ఖర్చు
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క్యాన్సర్ వ్యాధుల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లుగా నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందినా కూడా గ్రామీణంలో రూ.23,905 ఖర్చవుతుండగా.. పట్టణ ఆసుపత్రుల్లో రూ.19,982 వ్యయమవుతోంది. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలకు గ్రామీణంలో రూ.85,326 కాగా.. పట్టణాల్లో రూ.1,06,548 వ్యయమవుతోంది. ఛారిటీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు చికిత్స పొందినా కూడా గ్రామీణంలో రూ.1,04,084 ఖర్చవుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో రూ.85,306 వెచ్చించాల్సి వస్తోంది. ఇది రోగులకు మోయలేని భారంగా మారుతోందని ఈ గణాంకాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. ఆ తర్వాత చికిత్సల్లో అధిక ఖర్చు పెట్టాల్సి వస్తున్న జబ్బుల్లో గుండె, మెదడు, మానసిక జబ్బులు, చర్మ వ్యాధులున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందినా కూడా ఇంత భారీగా సొంతంగా జేబుల్లోంచి ఖర్చు పెట్టుకోవాల్సి రావడం గమనార్హం.
బీమా ధీమా లేదు
ఎటువంటి ఆరోగ్య బీమా పథకంలోనూ చికిత్స పొందకుండా ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణంలో 22.9 శాతం, పట్టణాల్లో 37.1 శాతం మంది ఉండగా.. తెలంగాణ గ్రామీణంలో 29 శాతం, పట్టణాల్లో 50.3 శాతం మంది ఉండడం గమనార్హం. ఖర్చుల్లో రోగి సొంతంగా భరించాల్సిన సొమ్ము గ్రామీణంలో కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందినా కూడా సొంతంగా భరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.