కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇవాళ తీర్పు వెలువరించనుంది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు సరైనవి కావంటూ హయాతుద్దీన్... కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేములఘాట్ రైతులు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై తీర్పురానుంది. అన్ని పక్షాల వాదనలు విన్న ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం... ఈనెల 12న తీర్పును రిజర్వ్ చేసింది.
వాదనలు పూర్తైన తర్వాత ఏమైనా రాతపూర్వకంగా సమర్పించేందుకు 16 వరకు గడువు ఇచ్చింది. 20వ తేదీన తీర్పును వెబ్ సైట్ పొందుపరుస్తామని స్పష్టం చేసింది.
ఆగస్టు 7న గోదావరి నది యాజమాన్య బోర్డుకు డీపీఆర్ సమర్పించకుండా. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని కేంద్ర జలశక్తి శాఖ రాసిన లేఖపై తెలంగాణ న్యాయవాదిని స్పందించాలని కోరామని తీర్పు రిజర్వ్ చేసిన రోజు ఎన్జీటీ ఆదేశాల్లో పేర్కొంది. ప్రాజెక్టు విస్తరణ వివరాలు కూడా సీడబ్ల్యూసీకి సమర్పించాలని.. అలా చేయకపోతే ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెలువడే ఎన్జీటీ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఇవీచూడండి:కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషనర్ల వాదన