రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం వెల్లడించింది. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్‌ను ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలు చేర్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు మార్చారని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారని పేర్కొన్నారు.
లోపభూయిష్ట నివేదిక...
ఏపీ ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక తయారు చేసిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని... ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వెల్లడించారు. తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ఏపీకి అనుకూలంగా ఉన్నందున కేసును ముగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్ అఫిడవిట్ ద్వారా తెలంగాణ వ్యతిరేకించింది.