తెలంగాణ

telangana

ETV Bharat / city

Agricultural Startups : పంటలకు ఊతమిచ్చే అంకురాలు.. మేనేజ్ ఆధ్వర్యంలో శిక్షణ, ప్రోత్సాహకాలు - agricultural startups helps farmers

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కొత్త ఆలోచనలతో ఏర్పాటు చేసిన అంకుర (స్టార్టప్‌) కంపెనీలను(Agricultural Startups in Telangana) కేంద్ర వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. వీటి ఫలితాలను రైతులకు, ప్రజలకు చేర్చేలా శిక్షణ ఇవ్వాలని రాజేంద్రనగర్‌లోని జాతీయ విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్‌)కు బాధ్యతలు అప్పగించింది.

Agricultural Startups
Agricultural Startups

By

Published : Oct 7, 2021, 8:00 AM IST

తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తుల తయారీ, రైతులకు సేవలందించేందుకు నెలకొల్పిన 14 అంకురాలను(Agricultural Startups in Telangana) తాజాగా జాతీయ విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్‌) ప్రారంభించింది. వాటికి రూ.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ ప్రోత్సాహకాలను ప్రకటించింది. నిర్వాహకులకు జాతీయస్థాయి నిపుణులతో సాంకేతిక శిక్షణ ఇప్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కొత్త ఆలోచనలతో ఏర్పాటు చేసిన స్టార్టప్​ల(Agricultural Startups in Telangana) ఫలితాలను రైతులు, ప్రజలకు చేర్చేందుకే కేంద్ర వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

వాంతుల సమస్య... అల్లంతో సరి...

కొందరు సాధారణ స్త్రీ పురుషులు, గర్భిణులకు ఉదయం పూట వికారం, వాంతుల సమస్యలుంటాయి. వీటి నివారణకు అల్లం మిఠాయి (అల్లం మురబ్బా) తినడం గృహవైద్యంలో సాధారణం. విదేశాల్లో సైతం ఉదయం పూట అల్లం వినియోగిస్తారు. దీనిపై అధ్యయనం చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, ఎంబీఏ పట్టభద్రురాలైన ఆయన చెల్లెలు కలసి అల్లంతో పానీయాన్ని తయారు చేశారు. దీనివల్ల వాంతుల సమస్య తగ్గిందని వారు నిరూపించారు. ఈ ఆలోచనతో వారు ఏర్పాటు చేసిన అంకుర కంపెనీ(Agricultural Startups in Telangana) వల్ల అల్లం సాగు పెరిగి, రైతుల ఆదాయం వృద్ధి అవుతుందని కేంద్రం గుర్తించింది. మేనేజ్‌ సంస్థ వీరికి రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించి శిక్షణ ఇచ్చింది.

ఓడోమాస్‌పై దృష్టితో... సుగంధ పంటలు

దోమ కాటు నుంచి తప్పించుకునేందుకు శరీరానికి ఓడోమాస్‌ ఆయింట్‌మెంట్‌ రాసుకుంటాం. దీని తయారీకి సిట్రనెల్లా మొక్కల నూనె వాడతారని తెలుసుకున్న వ్యవసాయ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు రవితేజ అలాంటి ఔషధ పంటలు, ఉత్పత్తుల లక్ష్యంతో అంకుర కంపెనీ(Agricultural Startups in Telangana) పెట్టారు. దీన్ని కేంద్ర వ్యవసాయశాఖ గుర్తించింది. రవితేజ స్వయంగా ఆదిలాబాద్‌ జిల్లా తంతోళి గ్రామ సమీపంలో కొన్ని సుగంధ ద్రవ్యాల పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. నిమ్మగడ్డి (లెమన్‌గ్రాస్‌), పామ్‌గ్రాస్‌, సిట్రనెల్ల, వట్టివేరు తదితర పంటలు పండించి వాటి నుంచి ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు. ఇలాంటి పంటలను రైతులతో పండిస్తే వారి ఆదాయం పెరుగుతుందని ఆయన మేనేజ్‌కు ప్రతిపాదనలు పంపగా అది ఆమోదం పొందింది.

చుట్టూ చూడండి...

"మా సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా 2019-20లో 59 అంకురాలను ఎంపిక చేసి రూ.6.14 కోట్లు ప్రోత్సాహకాలుగా ఇచ్చాం. 2020-21లో మరో 72 ఎంపిక చేసి రూ.7.23 కోట్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖకు సిఫార్సు చేశాం. తాజాగా తెలంగాణలో ఒకేసారి 14 అంకురాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇవన్నీ జాతీయస్థాయిలో వడపోసి గుర్తించినవే. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించండి. వాటి పరిష్కారానికి మీకు కొత్త ఆలోచన వస్తే, దాన్ని ఎలా అమలు చేయాలో సరైన ప్రతిపాదనతో ‘మేనేజ్‌’కు రండి. అది ఎంపికైతే శిక్షణ, నగదు ప్రోత్సాహకాలు ఇస్తాం."

- డాక్టర్‌ చంద్రశేఖర, డైరెక్టర్‌ జనరల్‌, మేనేజ్‌

ABOUT THE AUTHOR

...view details