రహదారుల అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించింది. రాష్ట్రావిర్భావం నుంచి జాతీయ రహదారులు విస్తరణ, పంచాయతీరాజ్-ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికు రచించింది. అందులో భాగంగానే ఆర్అండ్బీ పరిధిలోని 7,554 కిలోమీటర్ల స్టేట్ రోడ్‌ల అభివృద్ధికి రూ. 11,257 కోట్లు విడుదల చేసింది. రూ.7,463 కోట్లతో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.1868 కోట్లు ఖర్చు చేశారు.
నదులు, రహదారులపై వంతెనలు
మంజీర ,గోదావరి, మానేరు, ప్రాణహిత, మున్నేరు,అకేరు, మూసి, తుంగభద్ర తదితర నదులపై రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీ వంతెనలు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే 16 నిర్మాణాలను పూర్తి చేశారు. 2018-19లో బడ్జెట్లో రూ. 5,575 కోట్లు, 2019-20 లో రూ.2,219 కోట్లు, 2020-21లో రూ.3493.67 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సీసీ రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయించారు.
తెలంగాణ ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బీటీ రోడ్లు లేవు. రూ.2,518 కోట్ల వ్యయంతో 1,875 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్లుగా మార్చి.. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యం సమకూర్చింది. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లున్నప్పటికీ వాగులు, నదుల మీద అవసరమైనన్ని వంతెనల లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రహదారులు, పంచాయతీ రాజ్ రహదారులపై వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఆర్అండ్బీ పరిధిలో 511, పంచాయతీరాజ్ పరిధిలో 631 వంతెనల నిర్మాణం చేపట్టింది. కొత్తగా ఆర్వోబీలను నిర్మించింది.
పెరిగిన జాతీయ రహదారులు
రాష్ట్ర ఆవిర్బావం నాటికి కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగున్నరేండ్లలో అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది. ఇవేకాకుండా రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.