Reading Ability in SSC Students : రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు తెలుగులో సరిగా చదవడం, రాయడం రావడం లేదని, ఇంగ్లిష్‌లో పదాలు, వాక్యాలను సొంతగా చదవలేకపోతున్నారని నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే-2021లో వెల్లడైంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు జాతీయ సగటుతో పోల్చితే తక్కువగా ఉన్నాయని, గత నాలుగేళ్ల వ్యవధిలో విద్యార్థుల సామర్థ్యాల స్కోరు మరింత తగ్గినట్లు సర్వే నివేదిక పేర్కొంది.
Writing Ability in SSC Students : రాష్ట్రంలో 3, 5 తరగతుల విద్యార్థులకు భాషలు, గణితం, పర్యావరణం, 8వ తరగతి విద్యార్థులకు గణితం, సోషల్ సైన్సెస్, సైన్స్, భాషలు, పదో తరగతి విద్యార్థులకు మోడ్రన్ లాంగ్వేజి, గణితం, సైన్స్, సోషల్‌సైన్సెస్, ఇంగ్లిష్ భాషలపై అభ్యసన సామర్థ్యాలను మదింపు చేసింది. ఈ సర్వేలో రాష్ట్రానికి చెందిన 4,781 పాఠశాలల్లో 22,818 మంది టీచర్లు, 1,45,420 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సగటుతో పోల్చితే ఒకటి రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి.
ప్రభుత్వ విద్యార్థుల వెనుకబాటు :భాషలు, గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, పర్యావరణం సబ్జెక్టుల్లో 70 శాతం మంది విద్యార్థుల అవగాహన స్థాయి సాధారణం, అంతకన్నా తక్కువగా ఉంది. జాతీయస్థాయి సగటుతో పోల్చితే రాష్ట్రవిద్యార్థుల సగటు తక్కువగా నమోదైంది. సర్వేలో విద్యార్థులను అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాల్లో సగటున 45 శాతమే సరైనవిగా నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. వీరికన్నా బీసీ విద్యార్థుల ప్రగతి కొంచెం నయం.