తెలంగాణ

telangana

ETV Bharat / city

vishaka Cross fire: 'బూటకపు ఎన్​కౌంటర్ కాదు.. పక్కా సమాచారంతోనే చేశాం' - vishaka Cross fire

కొయ్యూరు ఎదురుకాల్పుల ఘటనపై విశాఖ జిల్లా ఓఎస్డీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతోనే దాడి చేశామని చెప్పారు. బూటకపు ఎన్​కౌంటర్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

'బూటకపు ఎన్​కౌంటర్ కాదు.. పక్కా సమాచారంతోనే చేశాం'
'బూటకపు ఎన్​కౌంటర్ కాదు.. పక్కా సమాచారంతోనే చేశాం'

By

Published : Jun 22, 2021, 8:17 PM IST

ఏపీ విశాఖ మన్యంలోని కొయ్యూరులో జరిగిన ఎదురుకాల్పులపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని విశాఖ జిల్లా ఓఎస్డీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ఘటన బూటకపు ఎన్​కౌంటర్ కాదన్నారు. సమావేశమవుతున్నారని సమాచారం అందటంతో అక్కడికి చేరుకున్నామన్నారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. చనిపోయిన ఆరుగురు మావోయిస్టులపై రివార్డులు ఉన్నాయని తెలిపారు. సమావేశం అయ్యేందుకు వచ్చిన వారిలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు కూడా సమాచారం ఉందని చెప్పారు. మృతి చెందిన వారిలో ఇద్దరు కీలక నాయకులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడానికి ప్రణాళిక వేసుకున్నారని వివరించారు. తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎదురుకాల్పుల ఘటనలో మీడియాకు వివరాలు చేరవేయడంలో కొన్ని లోపాలు జరిగాయన్నారు. భవిష్యత్తుల్లో అలా జరగవని చెప్పారు.

కొయ్యూరులో ఏం జరిగిందంటే..

విశాఖ మన్యం తుపాకుల మోతలతో దద్దరిల్లింది. కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు డివిజనల్‌ కమిటీ సభ్యులు, ముగ్గురు మహిళలున్నారు.

మృతులు వీరే..

ఎదురు కాల్పుల్లో డివిజనల్‌ కమిటీ సభ్యుల (డీసీఎం) క్యాడర్‌లో ఉన్న సందె గంగయ్య అలియాస్‌ డాక్టర్‌ అశోక్‌, రణదేవ్‌ అలియాస్‌ అర్జున్‌తో పాటు, ఏరియా కమిటీ సభ్యురాలు సంతు నాచిక, మహిళా మావోయిస్టులు పాయకే, లలిత మరణించారు.

స్పందించిన మావోయిస్టు పార్టీ..

విశాఖ మన్యం ఎదురుకాల్పులపై మావోయిస్టు పార్టీ (Maoist Party) స్పందించింది. పోలీసుల బలగాలు చేసిన ఆకస్మిక దాడిలో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని వెల్లడించింది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (AOB) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గణేష్ (maoist ganesh) పేరిట ఓ లేఖ విడుదలైంది. కాల్పుల్లో రణదేవ్ - ఒడిశా , అశోక్ - తెలంగాణ, సంతు - ఒడిశా, పాయకే- చత్తీస్​​గఢ్​, లలిత - ఆంధ్రప్రదేశ్(విశాఖ), చైతే - చత్తీస్​​గఢ్​ చనిపోయినట్లు వెల్లడించారు. వీరి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్యంలో జరిగిన దాడి సీఎం జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలోనే జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలగజేసినట్లు తెలిపారు. ఎన్ని దాడులు జరిగినా.. పీడిత ప్రజల ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details