తెలంగాణ

telangana

ETV Bharat / city

అగ్రి బిజినెస్.. ఆసక్తి ఉంటే ఈ కోర్సు మీకోసమే - జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ

Agri Business Course : ఈ రోజుల్లో యువత ఇంజినీరింగ్, మెడిసన్‌ లాంటి చదువులే కాకుండా వ్యవసాయ రంగం చదువుల వైపు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా అగ్రి బిజినెస్‌, మేనేజ్మెంట్ వైపు మళ్లుతున్నారు. ఇలాంటి వారి కోసమే జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ – నార్మ్‌ వ్యయసాయ పట్టభద్రులకు చక్కటి భవిష్యత్తునందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశపెట్టి యువతను పారిశ్రామికవేత్తలు, సీఈఓ లాంటి కీలక స్థానాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది.

Agri Business Course
Agri Business Course

By

Published : May 17, 2022, 3:26 PM IST

Updated : May 17, 2022, 3:55 PM IST

అగ్రి బిజినెస్ మ్యాన్ అవుతారా.. అయితే ఇది మీకోసమే

Agri Business Course : సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల తరహాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ...... అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ కోర్సు ప్రవేశపెట్టి భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తోంది. ఇటీవల 2017 నుంచి 2022 వరకు ఇక్కడ చదివిన నాలుగు బ్యాచ్‌ల విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ డే జరిగింది. దీనికి ఉపరాష్ట్రపతి హాజరై వెంకయ్యనాయుడు 163 మంది విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు.

Agri Management Course : నార్మ్‌ వేదికగా పీజీ డిప్లొమా కోర్సు చేయడానికి దేశనలుముూలల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఇక్కడ చదివిన వారంతా ఉద్యోగాలు సొంతం చేసుకుని రైతు సేవలో నిమగ్నమై ఉండటం ఆసక్తి కలిగించే అంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఐసీఏఆర్ అనుబంధ జాతీయ పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు.... కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో యువతకు పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నాయి.

Agri Business Management Course : ఈ అకాడమీ పీజీడీఎం, ఏబీఎం కోర్సులను 2009 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 12 బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే వ్యవసాయ అనుబంధ శాస్తాలకు సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. ఈ విద్యా భోదనలో అసెన్‌మెంట్స్, కేస్‌ స్టడీస్, సెమినార్స్, వర్క్‌షాప్‌, క్షేత్ర సందర్శన లాంటి అభ్యాసాలు ఉంటాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు ఇప్పటికే పలు సంస్థల్లోని వివిధ హోదాలో పనిచేస్తున్నారు.

విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీ పట్టా సొంతం చేసుకుని ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తగా ఎంపికైన వారికి కూడా నార్మ్‌లో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వీరు ఐసీఏఆర్ కేటాయించిన సంస్థలు, విశ్వవిద్యాలయలకు వెళ్లి పరిశోధన విస్తరణ సేవల్లో నిమగ్నమవుతారు. నార్మ్‌ అనేది దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు, వివిధ అంశాలపై రూపకల్పన చేసి సిఫారసు చేస్తుంది. అందువల్లే ఈ కేంద్రాన్ని థింక్ ట్యాంక్‌గా నరేంద్రమోదీ సర్కారు ప్రకటించింది.

ఈ అకాడమీలో ఏ- ఐడీఈఏ అని పిలుచుకునే వ్యాపార ఇంక్యుబేషన్ సెంటర్‌ ఉంది. ఇది అగ్రి-స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం ఇస్తుంది.ఇందులో విద్యార్థులు వ్యాపారవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం , ఆచరణాత్మకంగా నేర్చుకునే వెసులుబాటు పొందుతారు. ఈ రెండేళల్లో నార్మ్‌లో నేర్చుకున్నది రైతుల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలు తెలుసుకుంటారు. ఈ ఇంక్యుబేషన్‌ సెంటర్‌కి.... "బెస్ట్ ఎమర్జింగ్ ఇంక్యుబేటర్" పురస్కారం కూడా లభించింది.

"ప్రతి ఏడాది వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది. రైతుల అభ్యున్నతి కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆధునిక మార్పుల కోసం.. నయా టెక్నాలజీలు, వివిధ సంస్థలు అందుబాటులోకి రావాలి. కేవలం లాభాల కోసమే అని కాకుండా... వ్యవసాయ పద్ధతుల్ని ఎలా ఆధునీకరించాలి అనే దిశగా ముందడుగు వేయాలి. అగ్రి బిజినెస్‌లో శిక్షణ పొందడానికి నార్మ్‌ మంచి వేదిక." - డా.రమేష్‌నాయక్, ప్రొఫెసర్

అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ కోర్సు కార్యక్రమం ప్రారంభమైనప్పట్నుంచి 100 శాతం ప్లేస్‌మెంట్ సాధించింది. ఇప్పటి వరకు 80 అగ్రిబిజినెస్ కంపెనీలు... పీజీడీఎం-ఏబీఎం విద్యార్థులను నియమించుకున్నాయి. ప్రస్తుతం వీరు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూసారం, పంటల ఎంపిక, పంట మార్పిడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు వంటి ప్రధాన సమస్యలపై అధ్యయనాలు చేసి వాటి పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారు.

ఈ విద్యా ప్రణాళికలో 6 నుంచి 8 వారాల సమ్మర్‌ ఇంటర్న్‌షిప్, 13 వారాల ప్రాజెక్ట్‌ వర్క్స్‌ ఉంటాయి. అలాగే క్రెడిట్‌ కోర్సులు, నాన్‌ క్రెడిట్‌ కోర్సులు, బూట్‌క్యాంప్‌, యోగా వంటివి కూడా పొందుపరిచినట్లు నార్మ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

"మెడల్‌ దక్కినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రస్తుతం...నేను చెన్నైలో కంపెనీలో పని చేస్తున్నాను. ప్రొడక్ట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌లో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇది ఫైనాన్స్‌ అండ్‌ అగ్రివాల్యూ చైన్‌ కంపెనీ. ఉద్యోగంలో భాగంగా రైతులతో చాలా దగ్గరగా పని చేయడం ఆనందంగా ఉంది. నార్మ్‌లో వివిధ రకాలైన నైపుణ్యాలు పెంపొందించకుని... క్షేత్రస్థాయిలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను." - బాస్విని,అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ పట్టభద్రురాలు

"ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థలో 2017 నుంచి 2019 వరకు రెండేళ్లు చదివాను. ఇక్కడ కేవలం చదువులనే కాకుండా... మా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలుచుకున్నాం. రైతులతో కలిసిపోవడం బాగుంది. ప్రస్తుతం టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి వ్యవసాయ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. యువత అగ్రికల్చర్‌ కోర్సులో చేరాలి." - వినయ్‌కుమార్, అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ పట్టభద్రుడు

Last Updated : May 17, 2022, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details