ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కొంతకాలంగా అభ్యర్థుల తరఫున లోకేశ్ పోరాడుతున్నారు. ప్రభుత్వం(Govt) నిర్వహించతలపెట్టిన ఇంటర్వ్యూ ప్రక్రియపై ఇటీవల న్యాయస్థానం స్టే కూడా ఇచ్చింది. ఈ క్రమంలో అభ్యర్థులతో లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చుకునే కుట్రలు బయటపడ్డాయని ఆరోపించారు.
చరిత్రలో ఇంత తక్కువ పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డుల్లోకి ఎక్కారని లోకేశ్(lokesh) ఎద్దేవా చేశారు. మాట తప్పి, మడమ తిప్పడంతో పాటు ఉన్న కంపెనీలను తరిమేసి, నిరుద్యోగ భృతి ఎత్తేశారని ధ్వజమెత్తారు. స్పెషల్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఆంధ్రా గోల్డ్ లాంటి బ్రాండ్స్ మద్యం అమ్మే ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా చెప్తున్నారని ఆక్షేపించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్(job calender) ఇస్తా అని మోసం చేయడంతో ఎంతో మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.