Lokesh Phone Call To Constable Surendra Family Members: ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రంలో రౌడీషీటర్ల చేతిలో దారుణహత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. సురేంద్ర కుమార్ భార్య శ్రావణి, తల్లి దేవి, సోదరుడు రాజశేఖర్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. సురేంద్ర కుమార్‌ని హత్య చేసిన వారికి కఠినశిక్ష పడే వరకు తెదేపా పోరాడుతుందని లోకేశ్ స్పష్టం చేశారు. తన భర్త సురేంద్ర కుమార్‌ని అన్యాయంగా చంపేశారని ఈ సందర్భంగా శ్రావణి విలపించారు. ఇద్దరు బిడ్డలతో తాము జీవించటం ఎలా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
డ్యూటీ పట్ల ఎంతో నిబద్ధతతో ఉండే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారని.. కుటుంబానికి అండ లేకుండా పోయిందని సోదరుడు రాజశేఖర్ విలపించారు. ధైర్యంగా ఉండాలని సురేంద్ర కుటుంబాన్ని ఓదార్చిన లోకేశ్.. వైకాపా పాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. కానిస్టేబుల్‌ని అందరూ చూస్తుండగానే వెంటాడి వేటాడి హత్య చేసి నాలుగు రోజులవుతున్నా.. హంతకులను పట్టుకోకపోవటంపై అనేక అనుమానాలు ఉన్నాయని లోకేశ్ అన్నారు.
అడ్డుకున్న పోలీసులు: కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని తెదేపా నాయకులు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు పరామర్శించారు. నంద్యాలలోని ఇంటికి వెళ్లి సురేంద్ర భార్య శ్రావణి, తల్లి దేవి, పిల్లలను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసిన అఖిల ప్రియ.. హత్యకు గురైన సురేంద్ర వివరాలను తెలిపింది. సురేంద్ర భార్యతో ఫోన్ మాట్లాడించేందుకు యత్నించగా.. సీఐ ఆదినారాయణ రెడ్డి అడ్డుకున్నారు. చంద్రబాబుతో మాట్లాడించేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో భూమా అఖిల ప్రియకు సీఐకి మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా నాయకులను సురేంద్ర ఇంట్లో నుంచి పోలీసులు బయటకు పంపించారు. దీనిపై మండిపడ్డ తెదేపా నాయకులు.. వైకాపా నేతల ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.