ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ఇంట సంక్రాంతి శోభ కనిపించాలంటే తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించటంతో పాటు అన్నదాతల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దాదాపు 2 లక్షల మంది రైతులు రూ.2,788 కోట్ల ధాన్యం బకాయిల కోసం గత రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్నారని సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. అప్పు చేసి పంటలకు పెట్టుబడి పెట్టిన రైతన్నలకు సకాలంలో ధాన్యం బకాయిలు అందకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వివరించారు. ప్రభుత్వం ఉదాసీనత వల్ల ఈ ఏడాది ఏ రైతు ఇంటిలోనూ సంతోషాల కాంతి లేదన్నారు.
తక్షణమే ధాన్యం బకాయిలను చెల్లించాలి: లోకేశ్
ఏపీ సీఎం జగన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత రెండున్నర నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ఖరీఫ్‌లో వరుస విపత్తుల కారణంగా 50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లోకేశ్ అన్నారు. 10 వేల కోట్ల రూపాయల వరకూ పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారని తెలిపారు. దెబ్బతిన్న పంటల్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. తెదేపా హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తే, వైకాపా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులను 10 రోజులకు పెంచిందన్నారు. ఆ గడువులోనూ రైతులకు నగదు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి:పోలీసుల కస్టడీలో అఖిలప్రియ.. బేగంపేట మహిళా ఠాణాకు తరలింపు