ఏపీ సీఎం జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్నే నాశనం చేశారని విమర్శించారు. 21 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయలేదని మండిపడ్డారు. పింఛన్ డబ్బులు కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి మోసం చేశారన్నారు. అమ్మఒడిని అర్ధఒడి చేశారని ఆరోపించారు. మునిగిపోయే భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం సీఎం జగన్ ఏపీ ప్రయోజనాలన్నీ తాకట్టుపెట్టారన్నారు.
'జగన్ రెడ్డి పరిపాలన చూస్తే ఒకటి అర్థం అవుతోంది. పబ్లిసిటీలో పీక్.. మ్యాటర్ మాత్రం వీక్. ఇందుకు సన్నబియ్యమే మంచి ఉదాహరణ. ఎన్నికలకు ముందు సన్నబియ్యం అని చెప్పి.. తరువాత నాణ్యమైన బియ్యమన్నారు. వేలాది కోట్ల రూపాయలు పెట్టి వాహనాలను ఏర్పాటు చేశారు. బెంజ్ సర్కిల్ దగ్గర ప్రదర్శన పెట్టారు. స్పీడ్‌గా గ్రామాలకు పంపించారు. ఊళ్లల్లో ప్రజలు మాత్రం ఛీ కొట్టారు. అంతే స్పీడ్‌తో వాహనాలు తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చాయి'.
- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
పట్టణాలు, నగరాల్లోని అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిపోయిన ఎల్ఈడీ బల్బులను కూడా మార్చలేని పరిస్థితిలో ఉందన్నారు. జ'గన్' అని చెబితే ప్రజలందరూ నమ్మారు...కానీ అది బుల్లెట్ లేని గన్ అనే విషయాన్ని మరిచిపోయారని వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్న లోకేశ్... నరసరావుపేటలో అనూష అనే విద్యార్థిని దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు.
దిశ చట్టంతో ఏపీ ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖను.. భూకబ్జాలకు కేరాఫ్‌గా మార్చారని ఆరోపించారు. గత 21 నెలల వైకాపా పాలనలో కరెంట్ ఛార్జీలను విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. బస్సు ఛార్జీలతో పాటు ఇంటి పన్నులు విపరీతంగా పెంచారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న వైకాపా ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.
జగన్ పరిపాలనలో.. పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్: లోకేశ్ ఇవీచూడండి:న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్