తెలంగాణ

telangana

ETV Bharat / city

Lokesh Arrest: గుంటూరులో ఉద్రిక్తత.. నారా లోకేశ్ అరెస్ట్ - తెలంగాణ వార్తలు 2021

గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేశ్ వెళ్లారు. ఈ సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనితో లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Lokesh Arrest
Lokesh Arrest: గుంటూరులో ఉద్రిక్తత.. నారాలోకేశ్ అరెస్ట్

By

Published : Aug 16, 2021, 2:18 PM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి.

పరమయ్యగుంటలో పరిస్థితి ఉద్రిక్తం.. నారా లోకేశ్ అరెస్ట్

ఈ క్రమంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు.

నారాలోకేశ్​ స్పీచ్

అనంతరం లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు.

పరమయ్యగుంటలో పరిస్థితి ఉద్రిక్తం.. నారా లోకేశ్ అరెస్ట్

ఇదీ జరిగింది

దేశమంతటా స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న వేళ.. ఏపీలోని గుంటూరులో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమ్య హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, ‘దిశ’ కింద చర్యలు తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

విచక్షణారహితంగా దాడి..

గుంటూరుకు చెందిన నల్లపు వెంకట్రావు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రమ్య (20) చేబ్రోలు మండలంలోని ఓ మైనారిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. అక్క మౌనికతోపాటు గుంటూరు పరమయ్యగుంటలో నానమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. రమ్యకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన శశికృష్ణతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహమేర్పడింది. హత్య సంఘటనకు ముందు వారిద్దరు పరమయ్యగుంట వద్ద హోటల్‌ సమీపంలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదమేర్పడింది. యువతి ఇంటికి వెళ్లటానికి ప్రయత్నించగా శశికృష్ణ ఆమె చేయి పట్టుకుని లాగి కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. దీని సీసీ ఫుటేజీ పోలీసులకు లభ్యమైంది.

ఇదీ చూడండి:Murder: పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే హతమార్చాడు..!

ABOUT THE AUTHOR

...view details