Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని రూ.కోట్ల రూపాయలతో ప్రచారం చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెం పున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఏదా గన్.. ఎక్కడా జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే.. పోలీసులు నిందితులను పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 15 ఏళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన 'నిందితులను కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకు కల్పించే రక్షణ' అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.
అసలేమైందంటే..?
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా.. పోలీసులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.