ఫార్మాసిటీకి ఆటంకాలు.. ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస హైదరాబాద్ ఔషధ నగరి ఏర్పాటు కోసం భూముల సేకరణ శరవేగంగా సాగుతున్న క్రమంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలు రెవెన్యూశాఖ సంప్రదింపులు చేసినా సానుకూల స్పందన రావడం లేదు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల వద్ద ప్రతిపాదిత ఫార్మా సిటీ శంకుస్థాపనకు ఏర్పాట్లు సాగుతుండగా... యాచారం మండలం తాటిపర్తి, కుర్మిద్ద, నానక్‌గూడ, మేడిపల్లి గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుధవారం భారీ బందోబస్తు మధ్య నందివనపర్తిలో ఫార్మా సిటీ రోడ్డు భూ సేకరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది.
ఆర్డోవోపైకి కుర్చీ విసిరి ఆందోళన
నందివనపర్తి నుంచి ఫార్మా సిటీ వరకు 60 అడుగులు ఉన్న రోడ్డును 100 అడుగులతో... డబుల్ రోడ్డుగా విస్తరించనున్నారు. అందుకు అవసరమైన 40 ఎకరాల భూసేకరణ కోసం ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో కోపోద్రిక్తులైన రైతుల్లో నుంచి ఒకరిద్దరు... ప్రసంగిస్తున్న ఆర్డీవోపై కుర్చీ విసిరేయడం ఉద్రిక్తలకు దారి తీసింది.
10 మంది రైతుల ఆరెస్ట్
ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని రైతులు, ఇతర గ్రామస్థులను సభావేదిక వద్ద నుంచి పంపించేందుకు యత్నించారు. చివరకు 10 మందిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఫార్మా సిటీ అప్రోచ్ రోడ్డు కోసం భూసేకరణ నిమిత్తం రైతుల అభిప్రాయాలు తీసుకునేందుకు ఏర్పాటైన కార్యక్రమం ఆ తర్వాత ప్రశాంతంగా సాగిందని ఆర్డీవో తెలిపారు.
2016లో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అప్పటి నుంచి క్రమక్రమంగా భూములు సేకరిస్తోంది. కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 19 వేల 330 ఎకరాల భూములు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఇప్పటికే 50 శాతంపైగా సేకరించింది. ఇబ్రహీంపట్నం డివిజన్ యాచారం మండలంలో 6 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. పట్టా భూములు, అసైన్డ్ భూములు సంబంధించి న్యాయపరమైన చిక్కులు, వివాదాలు ఉండటం వల్ల... కొంత జాప్యం జరుగుతోంది. పట్టా భూముల సేకరణ అంశం ఓ కొలిక్కి తెచ్చే క్రమంలో భూసేకరణ వేగవంతం చేసింది.
ఈనెల 12న చీకటి దినం
ఈ ప్రాంతంలో ఎలాంటి జలాశయాలు, సాగు నీటి వనరులు లేకపోయినా మూడు పంటలు పండుతాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఎకరాకు రూ.16 లక్షల పరిహారం, 120 గజాల ఇళ్ల స్థలం తమకు వద్దంటూ రైతులు వ్యతిరేకిస్తున్నారు. సాగు యోగ్యమైన భూములు కోల్పోతే జీవనాధారం దెబ్బతిని రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర భూసేకరణ చట్టం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రెవెన్యూశాఖ బలవంతంగా భూములు లాక్కుంటామంటే తాము అంగీకరించబోమని బాధిత రైతులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా సిటీ వద్దంటున్న రైతులు, స్థానికులు... ఈ నెల 12న నందివనపర్తిలో చీకటి దినం పేరిట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. బుధవారం నాటి ఘటనకు నిరసనగా ఆ రోజున ఓ "స్థూపం" ఆవిష్కరించనున్నారు.
ఇదీ చూడండి:'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'