రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను గతంలో మాదిరిగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే.. సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పేర్ల నమోదు(Student Name Registration Issues)కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 2.20 లక్షలకు చేరింది. ఈ విద్యాసంవత్సరం (2021-22) ఆగస్టు 15వ తేదీ నాటికి 1.14 లక్షల మంది చేరినట్లు వెల్లడించిన పాఠశాల విద్యా శాఖ.. తాజాగా ఆ సంఖ్య 2.20 లక్షలకు పెరిగిందని తెలిపింది. వీరంతా సాధారణ బడులతోపాటు విద్యాశాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలు పొందారు. కరోనా కారణంగా పిల్లల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించే స్తోమత లేకపోవడానికితోడు వాటిలో ఆన్‌లైన్ తరగతులకు భారీగా రుసుములు వసూలు చేస్తుండటంతోనే తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సారి ఒకటో తరగతిలో దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందారు. పదో తరగతి విద్యార్థులు 2 లక్షల మందికిపైగా ఉత్తీర్ణులై కళాశాలల్లో ప్రవేశం పొందారు. అంతమొత్తం సంఖ్యలో ఒకటో తరగతిలో చేరాల్సి ఉండగా.. తక్కువగా నమోదయ్యారు. జనాభా వృద్ధి శాతం తగ్గిపోతుండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే.. ప్రైవేటు నుంచి వలసలు ఇంకా కొనసాగుతుండటంతో నమోదు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీసీలు లేకుండానే..