NAC Executive Committee meeting: మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన న్యాక్ క్యాంపస్‌లో న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. దళితబంధు లబ్ధిదారులకు ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా సాంకేతికంగా వారిలో నైపుణ్యాలను పెంపొందించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. 2022-23 సంవత్సరంలో 30,625 మందికి శిక్షణకు కార్యాచరణ రచించారు.
పలు ఇంజనీరింగ్ విభాగాల్లో 20 శాతం మంది వర్కింగ్ ఇంజినీర్లకు స్వల్ప కాలిక శిక్షణలు.. అదే విధంగా 2022-23 సంవత్సరంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతున్న ఇంజినీర్లు, టెక్నికల్ పర్సనల్ కీ.. 30 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని తీర్మానించారు. జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు తీసుకునేందుకు.. నైపుణ్యాభివృద్ధి న్యాక్ శిక్షణ కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున దశల వారిగా నిర్మించాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఉపాధి కోసం మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నారు. ఈ కేంద్రాలు నిరుద్యోగ యువతకు నిర్మాణం, ఐటీ, సేవల రంగాల్లో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర శిక్షణా కేంద్రాలుగా మారనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.