పెట్టుబడులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులును కోరారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన గోవిందరాజులుతో పలు అంశాలపై చర్చించారు.
భారతీయ జీవిక, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైనదని సీఎం అన్నారు. వ్యవసాయం లాభదాయకమైనది కాదనే దృక్పథంలో మార్పురావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలని.. విదేశాలకు అందించే స్థాయికి చేరాలని అభిలషించారు.
పరిశ్రమలకు కీలకమైన ముడి సరుకును వ్యవసాయ రంగమే అందిస్తోందన్న సీఎం.. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే ఆటుపోట్లను తట్టుకుంటోందని అభిప్రాయపడ్డారు.
పంటకాలనీలుగా..
వ్యవసాయాభివృద్ధికి.. ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రణాళిక అమలుచేయాలన్నారు. మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలని.. దీనిపై నాబార్డు అధ్యయనం చేయాలని ఆ సంస్థ ఛైర్మన్ గోవిందరాజులుకు సూచించారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని.. పంటల మార్పిడి విధానం పాటించాలని పేర్కొన్నారు.
పంటలు పండించే విధానంతో పాటు మార్కెటింగ్ విధానం ఉండాలన్న సీఎం కేసీఆర్.. దేశంలో వ్యవసాయాధారిత పరిశ్రమలకు చేయాతనివ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన భూమికను ప్రభుత్వాలు పోషించాలన్నారు.
రైతులను ప్రోత్సహించాలి..
సామూహిక వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డుకు కేసీఆర్ సూచించారు. రైతులే పంటలను ప్రాసెస్ చేసి అమ్మేలా యంత్రాలను అందించాలని కోరారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు పెట్టాలని నిర్ణయించామని నాబార్డు ఛైర్మన్ గోవిందరాజులుతో సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. ఆర్థిక చేయూత అందించే పథకాలు, కార్యక్రమాలకు నాబార్డు రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ జరగాలని వివరించారు.
ఇవీచూడండి:'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'