రాజేంద్రనగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) సెంటర్లో సంస్థ 45వ వార్షికోత్సవ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ పురస్కార గ్రహీత, భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ కార్యదర్శి డాక్టర్ రాజ్ ఎస్ పరోడా ముఖ్య అతిథిగా దిల్లీ నుంచి ఆన్లైన్లో పాల్గొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని అన్నారు. దేశంలో గల 80 శాతం చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఐసీఏఆర్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, నార్మ్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలని సూచించారు.
'రైతుల ఆదాయం పెరిగేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలి’ - రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్శిటీ
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని పద్మభూషణ్ గ్రహీత, భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ కార్యదర్శి డాక్టర్ రాజ్ ఎస్ పరోడా అన్నారు. రాజేంద్రనగర్ నేషనల్ అకాడమి ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన దిల్లీ నుంచి ఆన్లైన్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న, సన్నకారు రైతులు లాభపడేలా సేద్యాన్ని లాభసాటిగా తీర్చి దిద్దేందుకు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన సూచించారు.
గతంలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే సంస్థగా ఉన్న నార్మ్‌ను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మేథోధన కార్యశాలగా గుర్తించినందున జాతీయ స్థాయిలో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ వంటి సేవలే కాకుండా విధానాలు, సంస్కరణల రూపకల్పనకు కృషి చేయాలని డాక్టర్ పరోడా సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పంటల సాగులో పెట్టుబడులు తగ్గించేందుకు కీలక పాత్ర పోషించే యంత్రీకరణ, నీటి యాజమాన్యం, పంట కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు చేరువ చేయడంలో శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాబోయే 10, 20 సంవత్సరాల్లో వ్యవసాయ రంగం, రైతాంగం, ప్రజానీకం అవసరాలకు అనుగుణంగా విధానాలు ఎలా ఉండాలన్న అంశాలపై నార్మ్.. సుదూర లక్ష్యాలతో కూడిన విధానాలు రూపకల్పన చేస్తోందని సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా భవిష్యత్ వ్యవసాయం.. భవిష్యత్ భారతదేశానికి అవసరమైన విధానాలు ముందుగానే ఊహించడం ద్వారా ఎలా సేవ చేయాలో ప్రణాళిక రూపకల్పన చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నార్మ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సోమ్, శాస్త్రవేత్తలు, రైతులు, పరిశోధకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రణబ్ నిరుపమాన రాజనీతిజ్ఞుడు.. పాలనా విశారదుడు