వానాకాలం వస్తుందంటే ఎక్కడ నిలిచే ప్రాంతాలున్నాయి?.. ఏయే ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది?.. ఎక్కడ నాలాలు పొంగే అవకాశం ఉంది? మ్యాన్‌హోళ్ల పరిస్థితి ఏంటి?.. వంటి విషయాలన్నింటిని ముందుగానే బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏం చేయాలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా కురుస్తోన్న వానలకు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మృత్యుకుహరాలుగా మారుతున్న నాలాల పనులు మూడేళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. నగరంలో నాలాల ఆక్రమణలు తొలగించడంతో పాటు విస్తరణ కోసం చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షాకాలం వస్తుందంటే గ్రేటర్‌లో నాలాలపై చర్చ మొదలవుతుంది.
నాలాల విస్తరణ చేపట్టాలని నిర్ణయం
2000 సంవత్సరంలో నగరంలో భారీగా వర్షం కురిసింది. ఆ వర్షానికి హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లు మొత్తం నీట మునిగాయి. ఫలితంగా ఆ సమయంలో వరదముంపు ను నియంత్రించేందుకు నాలాల విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో నాలాల పొడవు 1221కిలోమీటర్లుగా ఉండగా అందులో ఓపెన్ నాలాలు 446కిలోమీటర్లు ఉన్నాయి. వీటిలో మేజర్ నాలాలు 391 కిలోమీటర్ల పొడవున్నాయి.
ఏళ్లు గడుస్తున్నా మార్పులేదు..
ఇతర వరద కాలువలు 55 కిలోమీటర్ల మేర ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఓపెన్ నాలాలే ఉన్నాయి. వాటిలో పూడిక తీయకపోవడం వల్ల కొద్దిపాటి వాన పడినా పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు పడినప్పడు ఈ నాలాలు, రహదార్లు ఏకమైపోతున్నాయి. అలాగే రోడ్లన్నీ బురదమయమై నడిచేందుకు కూడా స్థలం కనిపించకపోవడం వల్ల ప్రమాదమని తెలిసీ నాలాల పక్క నుంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ పైపుల్లో వ్యర్థాలు పేరుకుపోయి ఎక్కడిక్కడ నీరు నిలిచిపోతున్నాయి. ఫలితంగా మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతుండగా రోడ్లుచెరువుల్లా మారుతున్నాయి. నాలాలు, చెరువులపై అక్రమనిర్మాణాలు ఎక్కువవడం వల్ల మూసీలో కలవాల్సిన నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. వరదనీటిని నగరం నుంచి బయటకు పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు కూడా వచ్చాయి. ఏళ్లు గడుస్తున్నా నాలాల పరిస్థితిలో మార్పులేదు. విస్తరణ సంగతేమో గానీ.. కబ్జాకు గురవడం మాత్రం ఆగలేదు.
ఆస్తుల సేకరణలో జాప్యం
నాలాలపై ఎన్ని ఆక్రమణలున్నాయి. ఎంతమేర విస్తరించాలన్నది నిర్ణయించేందుకు అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ వేశారు. అప్పటి ఎంసీహెచ్‌లో 170కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలను విస్తరించాలని ఆ కమిటీ నివేదిక సమర్పించింది. 10వేల ఆక్రమణల తొలగింపుతో పాటు విస్తరణకు 6,700కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీగా మారిన తరవాత వోయాంట్స్ కన్సల్టెన్సీ నాలాలపై సర్వే నిర్వహించింది. నగరంలో వరద ఇబ్బందులు తగ్గాలంటే 390 కిలోమీటర్ల మేర నాలాల విస్తరణ పనులు చేపట్టాలని సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా బల్దియా నాలాల విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. పనులు కూడా మొదలుపెట్టడం వల్ల నాలాలకు ఇరువైపులా ఉన్న ఆస్తుల సేకరణలో జాప్యం జరిగింది.