గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో వివిధ ప్రాంతాల నుంచి 22 నీటి నమూనాలను, 9 చోట్ల పాల నమూనాలను సేకరించి విజయవాడ, గుంటూరు, ఏలూరులోని ప్రయోగశాలల్లో పరీక్షించారు. బాధితుల నుంచి 52 రక్త నమూనాలు, వెన్నుపూస నుంచి 35 నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. వీటి నివేదికల్లో అనుమానించదగ్గ లక్షణాలేవీ కనిపించలేదు. ఐఐసీటీ, ఎయిమ్స్, సీసీఎంబీలకు నీటి, రక్త, మల, మూత్ర నమూనాలతోపాటు బాధితుల ఇళ్ల నుంచి ఆహార నమూనాలు పంపించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఐసీఎంఆర్- ఎన్ఐఎన్ బృందం కూడా రంగంలోకి దిగింది. అంటురోగ పరిశోధన విభాగం శాస్త్రవేత్త డా.జేజే బాబు నేతృత్వంలో 9 మంది ఎన్ఐఎన్ శాస్త్రవేత్తల బృందం సోమవారం రాత్రికి ఏలూరు చేరుకుంది. వైద్యాధికారులను కలిసి పరిస్థితిని సమీక్షించింది. బాధితుల రక్త నమూనాలు సేకరించడంతోపాటు ఆహారం, తాగునీటి కల్తీ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ‘మొదట ఇక్కడే పరీక్షలు చేసి ప్రాథమిక అవగాహనకు వస్తాం. తర్వాత నమూనాలను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఎన్ఐఎన్లో పూర్తి స్థాయిలో పరీక్షించి కారణాలను కనుక్కొంటాం’ అని డా.జేజే బాబు ‘ఈనాడు’కు చెప్పారు. డా.సిన్హా, డా.అనంతన్, డా.మహేష్‌కుమార్, డా.రాఘవేంద్ర, డా.నవీన్‌కుమార్, డా.శ్రీను, శ్రీరామకృష్ణ, నస్రావలి ఈ బృందంలో ఉన్నారు. మరోవైపు ఆహార కల్తీ ఏమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పరీక్షించేందుకు బాధితుల ఇళ్ల నుంచి మిరప, కందిపప్పు, వంటనూనెల నమూనాలను కూడా సేకరిస్తున్నారు.
నీరు, ఆహారం కలుషితమైతే..
- నీరు లేదా ఆహారం కలుషితమైతే.. ఇంట్లో వారందరిపైనా ప్రభావం చూపాలి. ఇక్కడ కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. చాలా కుటుంబాల్లో అసలు ఈ సమస్య కనిపించలేదు.
- పంది మాంసం తిన్నా, దాని విసర్జితాలు నీటిలో కలిసినా టీనియా వామ్స్ (బద్దె పురుగుల) వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రభావం కడుపునొప్పి రూపంలో బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ కడుపునొప్పితో వచ్చిన కేసులే లేవు.
- నమూనాల పరీక్షల్లోనూ అనుమానించేలా లక్షణాలేవీ కనిపించలేదు. ఇలాంటి లక్షణాలతో గతంలో ఏదైనా వ్యాధి బయటపడిందా అని వైద్యులు అంతర్జాలంలోనూ శోధిస్తున్నారు.
- మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాతావరణ, వాయు కాలుష్యంపైనా దృష్టి పెట్టారు.
లక్షణాలున్నా సొంత వైద్యం!
మరోవైపు వింత వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఆసుపత్రికి రాకుండా ఇళ్లలో ఉన్నారా అని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. సుమారు 10 మందిని గుర్తించి ఆసుపత్రికి పంపించారు. లక్షణాలున్నా.. కొందరు సొంత వైద్యంతో కాలయాపన చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.