బల్దియా ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పత్రాల ముద్రణను నగరంలోని 15 ప్రింటింగ్ కేంద్రాలకు అధికారులు అప్పగించారు. చంచల్‌గూడలోని స్టేట్ ప్రింటింగ్ ప్రెస్ అకాడమీలో రిజిస్టర్ అయిన ప్రింటర్ల జాబితాను పరిశీలించి ఈ ఎంపిక సాగింది. అంబర్‌పేట్, పటాన్‌చెరు, చిక్కడపల్లి, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ఈ కేంద్రాలున్నాయి.
ఓటర్ల వేలికి పెట్టే సిరా చుక్క కథ తెలుసుకోండి.. - GHMC elections polling
బల్దియా ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పత్రాల ముద్రణను హైదరాబాద్లోని 15 ప్రింటింగ్ కేంద్రాలకు అప్పగించారు. మరి పోలింగ్ రోజున ఓటరు వేలిపై పెట్టే సిరా చుక్కకు పెద్ద కథే ఉంది. ఈ సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసుకోండి మరి!
ప్రింటింగ్ మొదలుకావడానికి ముందు రోజు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రతను నియమిస్తారు. అక్కడ విధులు నిర్వహించేవారికి గుర్తింపు కార్డులను పోలీసుశాఖ జారీ చేస్తుంది. అభ్యర్థుల తుది జాబితా ఖరారైన తర్వాత సంబంధిత జోనల్ కమిషనర్ ఆమోదం ఇస్తే ఆ బ్యాలెట్ పేపర్ నమూనాను ప్రింటింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. రిటర్నింగ్ అధికారి సర్టిఫై చేస్తే ప్రింటింగ్ మొదలవుతుంది.అవసరమయ్యే బ్యాలెట్ పేపర్లకు అదనంగా మరో 20 శాతం తయారుచేస్తారు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్‌నూ ముద్రిస్తారు.
ఒక బాటిల్ సిరాతో 750 మందికి
ఓటరు వేలిపై పెట్టే సిరాచుక్కకు పెద్ద కథే ఉంది. దీనిని కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఉన్న మైలాక్ (మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్) సంస్థ తయారుచేస్తుంది. 1937లో మైసూరు రాజా వంశస్థుడైన నాల్యాడి కృష్ణంరాజు రంగులు, రసాయనాల కోసం ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడ తయారైన సిరాను 1962 నుంచి దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఇతర దేశాలకు సైతం సరఫరా అవుతోంది. 10 మిల్లీలీటర్ల బాటిల్ సిరాతో 750 మందికి చుక్క పెట్టవచ్ఛు బల్దియా ఎన్నికలకూ దీనినే వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై గోరు-చర్మం కలిసే చోట స్పష్టంగా కనిపించేలా చిన్న చుక్క పెడతారు. ఇది పక్షం రోజుల వరకు చెరిగిపోదు. సెల్ఫీలు దిగి ‘ నేను ఓటు వేశా..మీరు కూడా వేయండి’ అంటూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న విషయం తెలిసిందే. బ్యాలెట్ ఎన్నికలు జరిగినా, ఈవీఎంలో ఓటేసినా సిరా ముద్ర పడాల్సిందే.