తెలంగాణ

telangana

ETV Bharat / city

కడుపున పుట్టిన వాడు కాదన్నాడు.. కానివాళ్లే 'చివరి' దిక్కయ్యారు!

చిన్నప్పుడు అంతా అనుకుంటూ ఉంటారు. పెద్దయ్యాక.. అమ్మను బాగా చూసుకోవాలని.. కష్టపెట్టకూడదని. కానీ పెళ్లై బాధ్యతలొచ్చాక.. చాలా మందికి అమ్మ బరువైపోతుంది. అందరి విషయంలో ఇది నిజం కాకపోవచ్చు. కానీ.. ఈ ప్రబుద్ధుడి విషయంలో మాత్రం ఇది వాస్తవమైంది. కన్నతల్లి చివరి ఘడియల్లోనూ.. కాదనుకుని కర్కశాన్ని ప్రదర్శించిన ఆ కుమారుడి గురించి.. మీరూ తెలుసుకోండి.

By

Published : May 26, 2020, 5:29 PM IST

sun refuses to his mother funerals
కడుపున పుట్టిన వాడు కాదన్నాడు.. కానివాళ్లే 'చివరి' దిక్కయ్యారు!

ఓ మాతృమూర్తికి.. అంతిమ ఘడియల్లో రాకూడని కష్టం వచ్చింది. కడుపున పుట్టిన కుమారుడు.. విగతజీవిగా పడి ఉన్న అమ్మను అక్కరకు రాదనుకున్నాడు. ఆస్తి పంచివ్వలేదన్న అక్కసుతో.. అతి దారుణంగా ప్రవర్తించాడు. చనిపోయిన తన తల్లికి కనీసం అంత్యక్రియలు చేసేందుకూ.. అతనికి మనస్కరించలేదు. చివరికి ఆమె భౌతిక కాయాన్ని కూడా ఇంటికి రానివ్వకుండా.. వీధిపాలు చేశాడు. పోలీసులు జోక్యం చేసుకోగా.. మృతదేహాన్ని ఇంటివద్దకు అనుమతించినా.. అంత్యక్రియలకు మాత్రం ముందుకు రాలేదు.

అతడి కర్కశత్వాన్ని చూసి.. ఖిద్మత్ స్వచ్ఛంద సంస్థ స్పందించింది. ఆ సంస్థ నిర్వాహకులకు హిందూ ఆచారాలు తెలియకపోయినా... అంతిమ సంస్కారాన్ని పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. కడుపున పుట్టిన వాడే కాలదన్నిన వేళ.. అన్నీ తామై కడసారి ఘట్టాన్ని పూర్తి చేసింది. ఆ మాతృమూర్తి భౌతిక కాయాన్ని ఖననం చేసింది.

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఇందిరానగర్​కు చెందిన సత్యనారాయణ, ధనలక్షి దంపతులకు కుమారుడు నాగమల్లేశ్వరరావు, కుమార్తె అన్నపూర్ణ సంతానం. సత్యనారాయణ జనవరిలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి తల్లి వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసింది. తన తల్లి కరోనాతో చనిపోయందనే భయం ఉందని శవపంచనామా నివేదిక వచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించబోనని నాగమల్లేశ్వరరావు మొండికేశాడు. ఆమెది సాధారణ మృతే అని వైద్యులు ఇచ్చిన పత్రాన్ని పోలీసులు చూపించినా... అంత్యక్రియలకు అతను అంగీకరించలేదు.

తమ తండ్రి చనిపోయిన సమయంలోనూ తనకు ఆస్తి రాసిస్తేనే తలకొరివి పెడతానని అన్నాడని నాగమల్లేశ్వరరావు సోదరి పోలీసులకు తెలిపారు. గతంలోనూ ఆస్తి కోసం తమ తల్లిని చిత్ర హింసలు పెట్టారని చెప్పారు. ధనలక్ష్మికి అంత్యక్రియలు జరిపించేందుకు కుమారుడు ముందుకు రాలేదు. కుమార్తె భర్త లాక్​డౌన్ నేపథ్యంలో విజయనగరంలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితుల్లో... మంగళగిరికి చెందిన ఖిద్మత్ సంస్థ ముందుకొచ్చింది. తమకు హిందూ ఆచారాలు తెలియకపోయినా ఇతరుల సహాయంతో ఆఖరి కార్యక్రమాలను పూర్తి చేసింది.

ఇవీ చూడండి:మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details