Musi River Overflow: భారీ వర్షాలతో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో బ్రిడ్జిని పోలీసులు మూసివేశారు. బ్రిడ్జి పైనుంచి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండడంతో నిన్నటి నుంచే రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం వరకు వంతెనపై నుంచి మూసీ వరద కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో అంబర్‌పేట - కాచిగూడ, మూసారాంబాగ్ - మలక్‌పేట మార్గాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఉద్ధృతంగా ప్రవసిస్తోన్న మూసీతో మూసారాంబాగ్ లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరిన శంకర్‌నగర్, మదర్స ప్రాంతాల్లోని స్థానికులను.. రత్నానగర్, పటేల్‌నగర్, గోల్నాక ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. వర్షం వచ్చినప్పుడల్లా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని.. శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.