పురపోరుకు నగారా మోగింది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, పది కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
తెలంగాణలో ఎన్నికల వేడి మళ్లీ రాజుకోనుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 22వ తేదీన పోలింగ్ జరిగేందుకు వీలుగా జనవరి ఏడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
రిటర్నింగ్ అధికారులు స్థానికంగా జనవరి ఎనిమిదో తేదీన ఎన్నికకు నోటీసు జారీ చేస్తారు. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పదో తేదీ వరకూ నామినేషన్ చేసుకోవచ్చు! మరుసటి రోజు జనవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
నామినేషన్ల తిరస్కరణకు గురైన వారు 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారి లేదా అదనపు జిల్లా ఎన్నికల అధికారి ముందు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీళ్లను 13వ తేదీన సంబంధిత అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది.
నామినేషన్ల ఉపసంహరణకు 14వతేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పోలింగ్ జనవరి 22వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వహిస్తారు.
ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 24వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 25వ తేదీన చేపడతారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్లు లెక్కించి పూర్తైన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
అటు ఎన్నికల కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు. ముసాయిదాపై వచ్చే నెల రెండో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
జిల్లా స్థాయిలో ఈ నెల 31న, మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల స్థాయిలో వచ్చే నెల ఒకటిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే నెల నాలుగో తేదీన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.