కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పురపాలక పట్టణాల్లో తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలకశాఖ.. కమిషనర్లను ఆదేశించింది. వైరస్ ప్రభావం, ముందు జాగ్రత్తలపై వివిధ రూపాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైళ్లు, స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేయడం సహా వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
చేపట్టనున్న చర్యలు..
- ఇంటింటికి కొవిడ్- 19 పై అవగాహన కలిగించాలి. కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, లక్షణాలు ఉంటే ఎలా స్పందించాలి వంటి అంశాలకు సంబంధించి కరపత్రాలు సహా ప్రచారం
- మైక్‌ల ద్వారా ప్రచారంతో అవగాహన.
- ఆలయాలు, చర్చ్‌లు , మసీదుల వద్ద అవగాహన కోసం కియోస్క్‌లు ఏర్పాటు. అంగన్‌వాడీ కేంద్రాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల ద్వారా అవగాహన.
- పారిశుద్ధ్య కార్మికులందరికి కోవిడ్- 19 లక్షణాలు, ముందు జాగ్రత్తలు, నియంత్రణ చర్యలపై అవగాహన.
- ప్రజా మరుగుదొడ్ల వద్ద అందుబాటులోకి హ్యాండ్ శానిటైజర్లు.
- పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన మాస్కులు, షూ, దుస్తుల అందజేత.
- పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర ప్రత్యేక ప్రాంతంగా, ఏడు కిలోమీటర్ల చుట్టు పక్కల బఫర్ జోన్‌తో మ్యాప్‌ల ఏర్పాటు.
- ఆసుపత్రులు, మురికివాడలు, ప్రత్యేక కేంద్రాలు సహా కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళిక రూపకల్పన.