తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి సాయంత్రంతో పురప్రచారం పరిసమాప్తం - muncipal elections latest news

పురపోరు ప్రచారం నేటితో పరిసమాప్తం కానుంది. సాయంత్రం ఐదు గంటలతో ప్రచార గడువు ముగియనుంది. తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. జీహెచ్​ఎంసీ పరిధిలోని డబీర్​పురాలోనూ ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

muncipolls-in-telangana
నేటి సాయంత్రంతో పురప్రచారం పరిసమాప్తం

By

Published : Jan 20, 2020, 5:42 AM IST

Updated : Jan 20, 2020, 7:22 AM IST

నేటి సాయంత్రంతో పురప్రచారం పరిసమాప్తం

పురపాలక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రచారపర్వం చివరి దశకు చేరుకొంది. ఇవాళ్టితో ప్రచార గడువు ముగియనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుంది. ప్రచార గడువు ముగిశాక ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. చరవాణులు, అంతర్జాలం ద్వారా కూడా ప్రచారం చేయరాదని తెలిపింది. పోలింగ్ సమీపిస్తోన్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

టీపోల్​ ద్వారా ఓటరు స్లిప్పులు

కరీంనగర్​లో మాత్రం ప్రచారం 22వ తేదీ సాయంత్రం ముగియనుంది. మిగతా తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఉపఎన్నిక జరుగుతోన్న జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్​పురా డివిజన్​లోనూ ఓటింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ కోసం తొమ్మిది కార్పొరేషన్లలోని 325 వార్డుల్లో 1438 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డుల్లో 6325 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఓటర్ల సౌకర్యం కోసం ఓటర్ స్లిప్పులను www.tsec.gov.in వెబ్ సైట్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించింది. టీపోల్ మొబైల్ యాప్​ ద్వారా కూడా ఓటర్ స్లిప్పులను పొందవచ్చు. వార్డుల వారీ ఓటర్ల జాబితాను కూడా వెబ్ సైట్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక సెలవుగా ప్రకటించారు. ఓటుహక్కు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు ఓటు వేసేందుకు వీలుగా మూడు గంటల పాటు సమయం ఇవ్వాలని ఆయా కంపెనీల యాజమాన్యాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పురపాలక ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని... ఓటర్లందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఓటు గోప్యతకు ఎలాంటి భంగం కలగదన్న ఎస్ఈసీ... అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే మూడు నెలల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చని తెలిపింది.

ప్రలోభాలకు గురిచేస్తే జైలుకే..

ఓటరు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకోకుండా ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, ఒత్తిళ్లు, భయభ్రాంతులకు గురిచేసినా ఏడాది పాటు జైలుశిక్షకు గురవుతారని స్పష్టం చేసింది. స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని ఎవరు దెబ్బతీసినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

Last Updated : Jan 20, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details