తెలంగాణ

telangana

ETV Bharat / city

మొదటివారంలో నోటిఫికేషన్‌... సంక్రాంతి తర్వాత ఎన్నికలు! - muncipal elections notification may release in january

పురపోరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం వార్డుల విభజన ప్రక్రియ పూర్తైంది. వార్డుల వారీ ఓటర్ల జాబితా సిద్ధం కావాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఓటర్ల వివరాల సేకరణకు కొంత సమయం పట్టనున్నందున... వచ్చే నెల మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది. సంక్రాంతి తర్వాత పోలింగ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొదటివారంలో నోటిఫికేషన్‌... సంక్రాంతి తర్వాత ఎన్నికలు!
మొదటివారంలో నోటిఫికేషన్‌... సంక్రాంతి తర్వాత ఎన్నికలు!

By

Published : Dec 22, 2019, 5:49 AM IST

Updated : Dec 22, 2019, 7:52 AM IST

మొదటివారంలో నోటిఫికేషన్‌... సంక్రాంతి తర్వాత ఎన్నికలు!

పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి వార్డుల విభజన ప్రక్రియ చేపట్టింది. 121 మున్సిపాలిటీలు, పది కార్పోరేషన్లలో 3,149 వార్డుల విభజనకు గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. వాటి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించాక తుది జాబితా ప్రకటించాలి.

వార్డుల విభజన...

పురపాలకశాఖ నుంచి గెజిట్ నోటిఫికేషన్లు అందినందున... కేంద్ర ఎన్నికల సంఘం నుంచి 2019 ఓటర్ల జాబితా తీసుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సంప్రదించారు. సోమవారం ఓటరు జాబితాలు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత వార్డుల వారీగా ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు పది రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వాటి ఆధారంగా పురపాలకశాఖ ఓటర్ల సర్వే చేపట్టాల్సి ఉంటుంది.

ఓటర్ల గుర్తింపు...

జీహెచ్ఎంసీ సహా అన్ని పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలి. 2018 ఓటర్ల జాబితా ప్రకారం గతంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. కానీ 2019 జాబితాతో నిర్వహిస్తున్నందున ఓటర్ల గుర్తింపు ప్రక్రియకు మరింత సమయం పడుతుందని అంచనా. గుర్తింపు పూర్తయ్యాక వాటి ఆధారంగా... మేయర్లు, ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో, వార్డుల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో ఖరారు చేస్తారు.

ఓకే విడతతో పోలింగ్‌!

రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు వారాల సమయం పట్టేలా కనిపిస్తోంది. కాబట్టి జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి... సంక్రాంతి తర్వాత ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ వెంటనే వీలైనంత త్వరగా మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక కూడా పూర్తిచేసి గణతంత్ర దినోత్సవం నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:రామోజీ ఫిల్మ్​సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి

Last Updated : Dec 22, 2019, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details