తెలంగాణ

telangana

ETV Bharat / city

వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు - వరవరరావుకు బెయిల్

వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు
వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు

By

Published : Feb 22, 2021, 11:30 AM IST

Updated : Feb 22, 2021, 1:16 PM IST

11:28 February 22

వరవరరావుకు బెయిల్

ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు ఊరట లభించింది. భీమా కొరేగావ్‌ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆరు నెలల పాటు బెయిల్‌ ఇస్తున్నట్లు జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, మనీష్‌ పిటాలేల నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 

గత కొద్ది రోజులుగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఆయన భార్య హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం. ఫిబ్రవరి 1న తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ రోజు తీర్పు వెలువరించింది. ఆరు నెలల బెయిల్‌ కాలం పూర్తైన తర్వాత లొంగిపోవడం లేదా బెయిల్‌ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. 

వరవరరావు ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింస చెలరేగింది. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్‌ యుద్ధాన్ని స్మరించుకునేందుకు దళితులు చేసిన ప్రయత్నం చివరకు అల్లర్లకు దారి తీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. ఈ కేసులో నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావు 2018 నవంబర్‌లో అరెస్ట్‌ అయ్యారు.

గడ్చిరోలికి సంబంధించిన మరో కేసు వరవరరావుపై కోర్టులో విచారణ నడుస్తోంది. ఆ కేసులో బెయిల్ మంజూరు అయితేనే వరవరరావు బయటకు వస్తారు. ఆ కేసుకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి:పీవీ ఘాట్​ వద్ద వాణీదేవి నివాళులు.. నేడు నామినేషన్ దాఖలు

Last Updated : Feb 22, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details