హైదరాబాద్ ఇందిరాభవన్‌లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని సీతక్క ఆరోపించారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్ కింద చూపించడం అన్యాయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, దళితబంధు ఎన్నికల హామీలేనని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలి
సబ్ ప్లాన్ ప్రకారం నిధులను ఖర్చు చేయాలని లేనట్లయితే గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సూచించారు. పోడుభూములను రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమాలు చేసి పేదలకు న్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసి హక్కులను కాపాడుకుందామని సీతక్క స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్‌లాల్ నాయక్, జాతీయ నాయకులు బెల్లయ్యనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.