రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. భద్రాద్రిలో గరుడ వాహనంపై రామయ్య, సీతమ్మ.. హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇచ్చారు. వేకువజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమవ్వగా.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వెంకన్నకు ప్రత్యేక పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ఏకాదశి వేడుకలు ఘనంగా సాగాయి. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యాన్ని వివరిస్తూ ఆలయంలో ప్రవచనాలు, మహా హారతి కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైకుంఠద్వారం వద్ద పుష్పవేదికపై స్వామివార్లకు నివేదన, వేదగోష నిర్వహించారు.
స్వామి సేవలో ప్రముఖులు
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పలువురు మంత్రులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని తితిదే దేవస్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మీర్‌పేట్‌లోని మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత దర్శనం చేసుకున్నారు. మోండా మార్కెట్‌లోని పెరుమాళ్ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెుక్కులు చెల్లించారు. వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు పల్లకి సేవ, పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని సీతారామ చంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని... మొక్కులు చెల్లించారు.
ఇక ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కరోనా నిబంధనలతో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.