Mudragada Letter to Jagan: మాజీ మంత్రి, కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. పలు ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ఉండే ఆయన.. ఈ సారి కోళ్లు, ఎడ్ల పందేలు నిర్వహంచుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ జగన్కు బహిరంగ లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు మెట్ట ప్రాంతాల్లో ఆడుకొనే కోడిపందేలు, ఎడ్ల బండ్ల పోటీలు వంటి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
దశాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తున్న ఉత్సవాలకు ఆటంకం కలిగించకుండా చూడాలని సీఎం జగన్ను ముద్రగడ కోరారు. జల్లికట్టు కంటే ఈ పందేలు ప్రమాదమైనవి కాదని.. పండుగల సమయంలో ప్రజలు జైలుకెళ్లే పరిస్థితి రాకుండా చూడాలని పద్మనాభం విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య కాలంలో పండుగల సమయంలో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బంది పెట్టడం.. ఆఖరి నిమిషంలో పర్మిషన్ ఇచ్చామని తూతూ మంత్రంగా చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు శాశ్వత అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ను ముద్రగడ కోరారు. పోలీసులు ఈ ఉత్సవాలు అడ్డుకొని ఇబ్బంది కలిగిస్తున్నారని.. వారు కూడా ఇబ్బంది పడుతున్నారని లేఖలో తెలిపారు.