ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీల సంతకాలు సేకరించినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 125 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు తెలిపారు. లాభాల్లో ఉన్న సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రైవేటీకరణకు నిరసనగా త్వరలో ప్రధానికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు విజయసాయి తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిందని.. పరిశ్రమకు నష్టాలంటే ప్రజలను తప్పుదోవ పట్టించినట్లేనని అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు సేకరించాం. లాభాల్లో ఉన్న సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా సంతకాల సేకరణ. ప్రైవేటీకరణకు నిరసనగా త్వరలో ప్రధానికి మెమొరాండం. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. పరిశ్రమకు నష్టాలంటే ప్రజలను తప్పుదోవ పట్టించినట్లే. -విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ
ఏపీ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడినట్లు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రూ.4,200 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇస్తామన్నారు. రాష్ట్ర వాటా రుణం రూపంలో ఇచ్చేందుకు అనుమతి కోరామని తెలిపారు. రైల్వేజోన్ ఏర్పాటు త్వరలో పూర్తవుతుందని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సౌత్‌సెంట్రల్ రైల్వేలోని ఉద్యోగాలు భర్తీతో పాటు అండర్‌పాస్ బ్రిడ్జిలు, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరామన్నారు. రెండు వందేభారత్ రైళ్లు ఏపీకి కేటాయించి.., విశాఖ-హైదరాబాద్, విశాఖ-చెన్నై మధ్య ఈ రైళ్లు నడపాలని రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.