Vijayasai Reddy land scam: ఇదీ.. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా భీమిలి మండలంలో కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ భారీగా భూములు కొన్న వ్యవహారంపై.. విలేకర్ల సమావేశంలో విజయసాయిరెడ్డి స్పందించిన తీరు. ఆ ప్రెస్మీట్లో ఆయన నోటి నుంచి ఇలాంటి ఆణిముత్యాలెన్నో జాలువారాయి. అయితే.. సాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీ 87వేల 714 చదరపు గజాల విస్తీర్ణమున్న 25 స్థలాల్ని కేవలం 11 నెలల వ్యవధిలోనే.. 51.87 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
బహిరంగ మార్కెట్లో ఇప్పటి ధరల ప్రకారం ఆ భూముల కనీస విలువ 177 కోట్లకు పైనే..! తన అల్లుడి కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందని, వాళ్లకు 100 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయని గొప్పలు చెప్పిన సాయిరెడ్డి... వాళ్లు బడా వ్యాపారవేత్తలు అయినంత మాత్రాన.. కోరుకున్న ప్రాంతంలో.. బహిరంగ మార్కెట్ ధరలో మూడో వంతు కంటే తక్కువకే ఎలా భూములు ఇచ్చేస్తారో కూడా చెబితే బాగుండేది.
ఈ భూదందాలో.. ఉత్తరాంధ్రకు సామంతరాజులా వ్యవహరించిన తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని సాయిరెడ్డి చెబితే జనం ఎలా నమ్మేస్తారు..? విజయసాయిరెడ్డి గురించి తెలిసినవారు, వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి హోదాలో దాదాపు సమాంతర ప్రభుత్వాధినేతలా చలాయించిన అసాధారణ అధికారాల్ని చూసినవాళ్లలో ఒక్కరైనా ఆయన మాటల్ని నమ్మే అవకాశం లేదు.
పేరుకు పార్టీ ఇన్ఛార్జే అయినా ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్ని డమ్మీలుగా మార్చేసి రాజ్యాంగేతరశక్తిలా వ్యవహరించారు. అధికార పార్టీలో నెంబర్-2గా అపరిమితమైన అధికారాల్ని అనుభవించారు. ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు.. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఎవరైనా సరే సాయిరెడ్డి కనుసన్నల్లో పనిచేయక తప్పేది కాదు.
వాళ్లంతా ఆయనకే రిపోర్ట్ చేయాలి:వాళ్లంతా ఆయనకే రిపోర్ట్ చేయాల్సిన దుస్థితి ఉండేది. ఉత్తరాంధ్రలో హవా నడిచినంత కాలం భూముల వ్యవహారాలన్నీ విజయసాయి కనుసన్నల్లోనే సాగాయి. మరీ ముఖ్యంగా విశాఖలో సాయిరెడ్డి హవా మామూలుగా ఉండేది కాదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆయనగారి ముందు జీహుజూర్ అనాల్సిందే. గిట్టనివారు, దారికిరానివారు, ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై ఎలా దాడులు చేయించారో, నిర్మాణాల్ని ఎలా కూలగొట్టించారో ప్రజలందరికీ తెలిసిందే.
సాయిరెడ్డి చక్రం తిప్పినంత కాలం దశాబ్దాల రాజకీయ అనుభవమున్న సీనియర్ మంత్రుల మాటల్ని కూడా అధికారులు ఖాతరు చేసేవారు కాదు. సీఐ నుంచి డీఐజీ వరకు.. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు... ఎవరి బదిలీ అయినా విజయసాయి చెప్పినట్లు జరగాల్సిందే. భూలావాదేవీలు సహా కీలక దస్త్రాలపై అధికారులు సంతకం పెట్టింది కూడా ఈయన అనుమతితోనే.!
అలాంటిది సాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన కంపెనీ.. ప్రతిపాదిత భోగాపురం బీచ్ కారిడార్ రోడ్డు పక్కన అత్యంత విలువైన భూములను బహిరంగ మార్కెట్ విలువ కంటే తక్కువకు కొనేస్తే.. అందులో ఆయన ప్రమేయం ఏమాత్రం లేదని చెబితే ప్రజలు నమ్ముతారా.. ఉత్తరాంధ్రను కబంధ హస్తాల్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేయకపోయి ఉంటే.. ప్రజల్ని బెదిరించి, భయపెట్టి, మభ్యపెట్టి, తీవ్ర ఒత్తిడికి గురిచేయనట్లయితే... అంత తక్కువ ధరకు భూముల్ని ఎందుకు ఇచ్చేస్తారు..?..
పోనీలే అని తక్కువ ధరకు ఇవ్వడానికి సాయిరెడ్డి కుమార్తె, అల్లుడేమైనా సమాజసేవ కోసం భూములు కొన్నారా..? విశాఖలోని ఒక ప్రముఖ విద్యాసంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందంటూ అధికారుల్ని దండయాత్రలా పంపించారు. గోడ పగలగొట్టి కంచె వేయించారు. ఇప్పుడు అదే విద్యాసంస్థ యాజమాన్యంలోని మరో సంస్థ.. అత్యంత విలువైన భూముల్ని సాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీకి తక్కువ ధరకే ఎలా ఇచ్చేసిందో జవాబు చెప్పాలని విశాఖకు చెందిన ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.