తెలంగాణలో 12వేల గ్రామాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇందిరా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పీవీ నర్సింహారావు దేశప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఉత్తమ్ పేర్కొన్నారు.
'అగ్రకులంలో పుట్టినా.. వెనుకబడిన వర్గాల కోసం తపించారు' - T congress leaders about pv narsimha rao
సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తోందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పీవీ శతజయంతిలో పాల్గొన్న ఉత్తమ్.. ఆయన తీసుకొచ్చిన భూసంస్కరణలు ఎంతో గొప్పవని కొనియాడారు.
పీవీ పీఎంగా ఉన్న సమయంలో తాను రాష్ట్రపతి భవన్‌లో ప్రొటోకాల్ ఆఫీసర్‌గా ఉన్నానని, ఆ సమయంలో పీవీతో అనేక అంశాలపై చర్చించే అవకాశం వచ్చిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
పీవీ నర్సింహారావు గొప్ప ఆర్థిక సంస్కర్త అని మాజీ మంత్రి గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా కచ్చితంగా ఉండేవని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేశం కోసం తపించిన వ్యక్తి.. పీవీనేనని, ఆయనను దేశం ఎన్నటికి మరిచిపోదని ఆమె అన్నారు. పీవీ అగ్రకులంలో పుట్టినా వెనుకబడిన తరగతుల కోసం పరితపించిన నాయకుడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు పేర్కొన్నారు.