పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా.. మానవ జీవితం అల్లకల్లోలం కాకుండా.. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం.. హరితహారం(Haritha Haram) కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే ఆరు విడతలు పూర్తి చేసుకున్న హరితహారం కార్యక్రమం.. నేడు ఏడో విడతలో అడుగుపెట్టింది. ఈ విడతలో 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రచించింది.
మొక్కలు నాటిన ఎంపీ..
ఏడో విడత హరిత హారం కార్యక్రమం.... గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా... రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్(Mp Santhosh Kumar) మొక్కలు నాటారు. జాతీయ వైద్యుల దినోత్సం దృష్ట్యా... డాక్టర్లతో కలిసి హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని చిల్డ్రన్స్ పార్కులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రంలో మొక్కల పెంపకం ప్రోత్సహించేందుకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టారు. ఇప్పటికే వందల మంది నేతలు, అధికారులు, సెలబ్రిటీలకు హరిత సవాల్ విసిరారు.
15,241 నర్సరీలు.. 25 కోట్ల మొక్కలు
మరోవైపు రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కోసం ఏర్పాట్లు చేసింది. 20కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈసారి బహుళ వరుస రహదారి వనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని రకాల జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట పలు వరుసల్లో మొక్కలు నాటనున్నారు. వీలున్న ప్రతిచోటా యాదాద్రి నమూనాలో మియావాకీ తరహాలో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇంటింటికి ఆరు మొక్కలు
ప్రతి మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో కనీసం ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణ ప్రాంతాల్లోని ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు కట్టబెట్టనున్నారు.