అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. సుమోటోగా లేదా దర్యాప్తు సంస్థ పిటిషన్‌తో పాటు ఇతరుల పిటిషన్ ద్వారా కూడా బెయిల్ రద్దు చేయవచ్చునని గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు పేర్కొన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. కాబట్టి బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసేందుకు తాను అర్హుడినేనన్నారు. సాక్షులను ప్రభావితం చేయవద్దన్న ప్రధాన షరతును జగన్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎలాంటి షరతులైనా పాటిస్తానని, విచారణకు సహకరిస్తానన్న హామీని బేఖాతరు చేశారన్నారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ ఏడాదిన్నరగా విచారణకు హాజరు కావడం లేదన్నారు. చాలా మంది సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నందున.. స్వేచ్ఛాయుత విచారణ ఆశించలేమని పిటిషన్లో ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
'గ్యాంగ్ ఏర్పాటైంది'
జగన్మోహన్ రెడ్డి తన సహనిందితులుకు కీలక పదవులు ఇచ్చి గ్యాంగ్‌గా ఏర్పాటు చేశారని రఘురామకృష్ణరాజు పిటిషన్లో ఆరోపించారు. విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారన్నారు. మరో నిందితుడిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌కు ఇద్దరు సీనియర్లను పక్కన పెట్టి సీఎస్ పోస్టు ఇచ్చారని ఆరోపించారు. అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారని.. ఎమ్మార్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ట్రైమెక్స్ ప్రసాద్‌కు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారని ప్రస్తావించారు.
'వాళ్లకే పదవులు'
ధర్మాన ప్రసాదరావుకు ఎమ్మెల్యే, ఆయన సోదరుడికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని రఘురామకృష్ణరాజు అన్నారు. శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి తీసుకొచ్చి అదనపు సీఎస్‌ను చేశారని పిటిషన్లో వివరించారు. శామ్యూల్‌కు ప్రభుత్వ సలహాదారుడిగా కేబనెట్ ర్యాంకు ఇచ్చారన్నారు. సాక్షులు ముందుకు రాకుండా అపవిత్ర గ్యాంగు ఎంతకైనా తెగించవచ్చునని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ఇలాగే జరుగుతుందని హెచ్చరించేందుకు.. తనకు అనుకూలంగా పనిచేయని అధికారులను జగన్మోహన్ రెడ్డి బదిలీ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు.