ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి లేఖ(RRR LETTER TO JAGAN) రాశారు. 'నవ హామీలు.. వైఫల్యాలు' పేరుతో ఇప్పటికే 9 లేఖలు రాసిన రఘురామ.. 'నవ ప్రభుత్వ కర్తవ్యాలు' పేరుతో మరో 9 లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు.
RRR LETTER: 'అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి సీఎం సార్'
ఏపీకి చెందిన వైకాపా ఎంపీ రఘురామ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు మరో లేఖ రాశారు. 3 రాజధానుల నిర్ణయం సరైన దృక్పథంతో తీసుకున్నట్లుగా లేదని లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 'నవ ప్రభుత్వ కర్తవ్యాలు' పేరుతో మరో 9 లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు.
3 రాజధానులపై సీఎం ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేసిందని రఘురామకృష్ణరాజు తెలిపారు. గతంలో సీఎం జగన్.. రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారని గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగింపుపై ప్రస్తావిస్తూ ఎంపీ తొలి లేఖ రాశారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలోనూ అమరావతిపై ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై చర్చించిన సమయంలో కనీసం 30 వేల ఎకరాల్లో రాజధాని ఉండాలని అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ సూచించారని పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక నిర్ణయం మార్చడం పెద్దరికం కాదని ఎంపీ హితవుపలికారు. ప్రజలు ఇచ్చిన తీర్పును దుర్వినియోగం చేయొద్దన్నారు. అమరావతిని.. భ్రమరావతిగా మార్చి భవిష్యత్తు లేకుండా చేశారని రఘురామ తెలిపారు. 3 రాజధానుల నిర్ణయం సరైన దృక్పథంతో తీసుకున్నట్లుగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.