రాష్ట్రంలో ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితిని ఆ బృందానికి రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. జూన్ 23నాటికి కొవిడ్-19 పాజిటివ్ రేటు 32.1 శాతం ఉందని ఇది దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధికమన్నారు. ట్రూనాట్ యంత్రాల కొరత ఉందని.. పొరుగు రాష్ట్రం ఏపీలో 44 ట్రూనాట్ యంత్రాలుండగా తెలంగాణలో కేవలం 22 యంత్రాలు మాత్రమే ఉన్నాయని లేఖలో తెలిపారు. పరీక్ష కోసం ఒకే ఒక కేంద్ర ప్రయోగశాల మాత్రమే ఉన్నదని.. ఈ జనాభాకు ఇది సరిపోదని రేవంత్ రెడ్డి వివరించారు. టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిని నడపడానికి అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది లేనందున టిమ్స్ నామమాత్రంగా నడుస్తుందన్నారు. పార్లమెంట్ కోటా నుంచి నిధులు కేటాయించినా ఇప్పటి వరకు ఉపయోగించలేదని కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు.
గాంధీ ఆస్పత్రి మాత్రమే ప్రభుత్వ అనుమతి పొందిన చికిత్సా కేంద్రంగా గుర్తించబడిందని, అక్కడ కూడా సరైన మందులు, పారిశుధ్యం, పరిశుభ్రత,కొవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స చేయడంలో జాగ్రత్తలు లేవని ఏకరువు పెట్టారు. ఆసుపత్రిని నడపడానికి 1200 మంది సిబ్బంది అవసరం, కానీ వాస్తవంగా 400 మాత్రమే సిబ్బంది ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితి అక్కడ పనిచేసే ప్రతి సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి మోపుతుందన్నారు.