తెలంగాణ

telangana

ETV Bharat / city

హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​ - రేవంత్​రెడ్డి వార్తలు

revath reddy moved to high court
హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​

By

Published : Jun 12, 2020, 3:48 PM IST

Updated : Jun 12, 2020, 4:56 PM IST

15:45 June 12

హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్​

      తన అరెస్టు విషయంలో పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్ ఏసీపీ ఎన్.శ్యాం ప్రసాద్​రావు, నార్సింగి ఇన్​స్పెక్టర్ గంగాధర్​పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. డ్రోన్​తో చిత్రీకరించారన్న ఆరోపణలపై తనపై నార్సింగి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైనట్లు తెలియగానే.. స్వయంగా వెళ్లి 41ఏ నోటీసు ఇస్తే వివరణ ఇస్తానని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినా నోటీసు ఇవ్వకుండా.. ఎంపీగా పార్లమెంటు సమావేశాల్లో హాజరుకావల్సి ఉన్నప్పటికీ అరెస్టు చేశారని ఆరోపించారు.  

      జైలుకు పంపించే ఉద్దేశంతో తనకు సంబంధం లేని కేసులను కూడా రిమాండ్ నివేదికలో ప్రస్తావించారన్నారు. ఏడేళ్లలోపు శిక్ష ఉండే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత.. అవసరమైతేనే అరెస్టు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని పిటిషన్​లో పేర్కొన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు.

అసలు ఏం జరిగింది..  

      రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం జన్వాడ గ్రామం వద్ద 111 జీవోకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్​ ఫాంహౌస్​ నిర్మిస్తున్నారని ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ లోక్​సభ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో ఆరోపించారు. జన్వాడ గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఫామ్​ హౌస్​ను మీడియాకు చూపించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ప్రైవేటు స్థలంలో డ్రోన్​ చిత్రీకరణకు అనుమతిలేదంటూ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్​రెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడుదల చేశారు.

కేటీఆర్​కు ఊరట..  

   అనంతరం ఫాంహౌస్​ వ్యవహారంపై జాతీయ హరిత ట్రైబ్యునల్​ని ఎంపీ రేవంత్​రెడ్డి ఆశ్రయించారు. స్పందించిన ఎన్​జీటీ విచారణకు కమిటీని నియమించింది. హరిత ట్రైబ్యునల్​ నిర్ణయంపై మంత్రి కేటీఆర్​ హైకోర్టును ఆశ్రయించగా... ఉన్నత న్యాయస్థానం ఎన్​జీటీ ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  

ఇవీచూడండి: పోలీసుల అదుపులో ఎంపీ రేవంత్​రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత

Last Updated : Jun 12, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details