"కొనలేరు... వినలేరు" "విద్యార్థులపై ఆర్థిక భారం - అప్పు చేసి స్మార్ట్ ఫోన్లు కొంటున్న తల్లితండ్రులు" అన్న శీర్షికతో "ఈనాడు" లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. "కూలీ పనులే ఆధారం... ఫోన్ ఎలా కొనగలం" అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ గుర్రం రంజిత్‌రెడ్డి స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సమీపంలోని లాలాముత్నూరుకు చెందిన గంగ అనే మహిళ... తన ముగ్గురు పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు వినేందుకు స్మార్ట్‌ఫోన్, టీవీ లేక ఇబ్బంది పడుతున్నారు. వారి బాధను అర్ధం చేసుకుని ముగ్గురు పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు వినేలా టీవీ సమకూర్చేందుకు ఎంపీ రంజిత్‌రెడ్డి ముందుకొచ్చారు.
లాలాముత్నూరు గ్రామ సర్పంచి ద్వారా ఆ కుటుంబంతో ఏంపీ రంజిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా పాఠాలు వినేందుకు ఆ ముగ్గురు పిల్లలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. టెలివిజన్ కొనుగోలు కోసం అవసరమైన రూ.15 వేలను సర్పంచ్ ఖాతాకు బదిలీ చేశారు. ఆ మొత్తాన్ని గ్రామ పెద్దలు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి అందజేశారు.