‘జగనన్న, వైఎస్సార్ పేర్ల మీద ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 48 పథకాలున్నాయి. ఇది న్యాయమా? సరైనదా? సొమ్ము ప్రజలది.. పేర్లు మీవా?’ అని ఏపీ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి తూర్పుగోదావరిలో ప్రారంభించిన కార్యక్రమానికి జగనన్న విద్యా కానుక అని పేరు పెట్టారు. దీవెనలు అయిపోయాయి కానుకలు మొదలుపెట్టారు. ఇటీవల జగనన్న పాలు లక్ష ప్యాకెట్లు నేలపాలు అయినట్లు సమాచారం. తండ్రులు చనిపోతే ట్రస్టులు పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తారు.
మీరు సొంత సొమ్ము రూపాయి తీయకుండా ప్రభుత్వ సొమ్ముతో ఇలా చేస్తున్నారు. ప్రభుత్వంలో మనం ఉన్నామనుకున్నా కేంద్ర ప్రభుత్వ పథకాలకూ మన పేర్లు పెట్టి ఇలా చేయడం సరికాదు. పథకాలకు పేర్లపై పవన్ కళ్యాణ్ చేసినది సమంజసమైన వ్యాఖ్యే. పథకాలకు గాంధీ, పటేల్, వాజ్‌పేయీ, అబ్దుల్ కలాం వంటి వాళ్ల పేర్లు పెట్టొచ్చు. ఐసీడీఎస్, అంగన్‌వాడీ పథకాలకు జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టారు. ప్రధానమంత్రి మాతృవందన యోజనలాగానే ముఖ్యమంత్రి యోజన పెట్టవచ్చు. ఈ అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశా. ప్రతి దానికి జగనన్న అని తగిలిస్తున్నారు. మీరు ఎవరికి అన్న!. షర్మిలకు, సునీతకు, అవినాష్‌రెడ్డికి, ఇంకొందరికి అన్న. ప్రజలందరికీ దీవెనలు, కానుకలు ఇస్తూ మన పేరు పెట్టుకోవడం సమంజసం కాదు..’ అని రఘురామ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో రఘురామకు ఊరట