MP Komatireddy Venkat Reddy News : ప్రజలకు ఏం చేసిందని తెరాస పార్టీ కోట్ల రూపాయల ఆర్భాటాలతో ప్లీనరీలు నిర్వహించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. యాసంగి వరి కోతలు ప్రారంభమైనా.. ఇప్పటికీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తీసుకువచ్చిందని ఆరోపించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని.. కక్షపూరితంగా నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని విమర్శించారు.
రేవంత్ సభకు రాను:తెలంగాణలో రాహుల్ సభ కోసం రేపు నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు సన్నాహక సమావేశానికి హాజరు కావటంలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అధికార కార్యక్రమాల కారణంగా సన్నాహక సమావేశానికి వెళ్లడం లేదని చెప్పారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా... బలహీనపడిన ఆదిలాబాద్, నిజామాబాద్‌లో జనసమీకరణపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.
నా జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠం : "నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉంది. వేరే నేత వచ్చి నల్గొండలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల సమీక్షలు పెట్టుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తేస్తాం. కేసీఆర్ పొత్తు అడిగినా మా అధిష్ఠానం ఒప్పుకోలేదు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణం. నా నియోజకవర్గంలో గడ్కరీ కార్యక్రమాలు ఉండటం వల్లే రేపు నల్గొండలో రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరు కావట్లేదు."