అధికారం చేపట్టిన ఎనిమిదేళ్లలో తెరాస ప్రభుత్వం రైతులకు చేసిందేం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. డబ్బులు సంపాదించుకోవటం తప్పా.. చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన లేఖలో ఎక్కడ కూడా వడ్లు కొనమని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఎవరు వచ్చినా.. చర్చకు సిద్ధమని అర్వింద్ సవాల్ విసిరారు.
ఎలాంటి ప్రయోజనం లేదు..
"మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 2 కోట్ల టన్నులైనా కొంటామన్నారు, ఇప్పుడు వరి వద్దంటున్నారు. ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో కేసీఆర్ చెప్పాలి. వ్యవసాయరంగంలో ప్రపంచమంతా టెక్నాలజీ పెంచుకుని దూసుకుపోతోంది... మీరు కూడా టెక్నాలజీ పెంచుకుని అభివృద్ధి సాధించాలని లేఖలో కేంద్రం పేర్కొంది. కేవలం బాయిల్డ్ రైస్ కొనమని మాత్రమే కేంద్రం చెప్పింది. గరీబోళ్లు తినే బియ్యాన్ని ఫోర్టిఫై చేసేందుకు తెలంగాణ ప్రాంతంలోని రైస్‌మిల్లులను అడ్వాన్స్ చేసుకోవాలని చెబుతోంది. రైస్‌బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని సూచించింది. దీనిపై కేబినెట్ నుంచి ఎవరు వచ్చినా.. నేను చర్చకు సిద్ధం. ఎక్కడికైనా వచ్చి దీనిపై మాట్లాడతా.. ఎవరోస్తారో రమ్మనండి.