తెలంగాణ

telangana

ETV Bharat / city

Corona effect: వాళ్ల కష్టం.. ఇంకెవరికీ రాకూడదు! - latest news in east godavari district

అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మతో ఆన్‌లైన్‌ క్లాసులతో సాగిపోతున్న జీవితం ఓ బాలుడిది.ఆస్ట్రేలియాలో ఉద్యోగమైనా వర్క్‌ ఫ్రంహోం వల్ల అమ్మానాన్న కళ్లముందే విధులు నిర్వర్తిస్తున్నాడు ఓ యువకుడు. వీరిద్దరి జీవితంలో కరోనా కల్లోలం సృష్టించింది. అమ్మానాన్నతో సహా అయిదుగురు పెద్దలను ఆ బాలుడు కోల్పోతే.. అతనికి మేనమామ అయిన ఆ యువకుడు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక కన్నీళ్లు రెప్పదాటకుండా మౌనవేదన అనుభవిస్తున్నాడు.

Corona effect, Corona effect on a boy's life, boy lost family due to corona
కరోనా ప్రభావం, కరోనా వల్ల అనాథగా బాలుడు

By

Published : Jun 20, 2021, 10:07 AM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజీవ్.. సహర్ష (12).. వరసకు మేనమామ, మేనల్లుళ్లు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలిస్తే.. ఎంతటి కర్కశులైనా చలించిపోతారు. అయ్యో పాపం.. అనక మానరు. కరోనా సృష్టించిన కల్లోలం.. ఈ కుటుంబాన్ని కకావికలం చేసిన తీరుకు.. ఎవరైనా సరే.. ఆవేదన చెందుతారు. తల్లిదండ్రులు ఇక లేరన్న విషయం తెలియని ఆ 12 ఏళ్ల బాలుడు.. మామూలుగానే ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తుంటే.. ఆ విషయం చెప్పలేక అతని మేనమామ రాజీవ్ నరకయాతన అనుభవిస్తున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులనూ కోల్పోయిన రాజేశ్​ ఆ విషయాన్ని కూడా.. సహర్షకు చెప్పలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తోడబుట్టిన ఆడబిడ్డ కుటుంబంతో పాటు.. తల్లిదండ్రులనూ కోల్పోయి.. మేనల్లుడి కోసం శోకాన్ని దిగమింగుతున్నారు.

క్రికెడ్ ఆడి బాలుడిని చీర్ చేసిన ఎంపీ

అసలేం జరిగింది...

రాజోలు సమీపంలోని శివకోడు గ్రామానికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ మేడిచర్ల వి.సుధీర్‌రాయ్‌ (45), ఆయన భార్య శ్వేత హరిత (36), తల్లి ఉమామహేశ్వరి (74), కుమారుడు సాయి సత్య సహర్షతో కలిసి ఉంటున్నారు. సుధీర్‌రాయ్‌ దంపతులకు ఏప్రిల్‌లో కరోనా సోకింది. శ్వేత హరిత సోదరుడు బండారు రాజీవ్‌ వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్చాడు. అల్లుడైన 12ఏళ్ల సాయిసత్య సహర్షను చూసుకుంటూ వారింటి వద్దే ఉంటున్నాడు. ఏప్రిల్‌ 25న సుధీర్‌రాయ్‌, మే 9న శ్వేతహరిత, మే 4న ఉమామహేశ్వరి మృతిచెందారు. రాజీవ్‌ ఈ విషయం సహర్షకు చెప్పకుండా ఆసుపత్రిలో ఉన్నారంటూ దాటవేస్తూ వస్తున్నారు.

ఇంతలో మరో విషాదం...

కిర్లంపూడి మండలం రామచంద్రపురంలో ఉంటున్న సహర్ష తాతయ్య, అమ్మమ్మ.. రాజీవ్‌ అమ్మానాన్న అయిన బండారు సురేష్‌కుమార్‌ (65), శేషవాణి (60) సైతం కరోనా బారిన పడ్డారు. వారు జూన్‌ 1, 2 తేదీల్లో కన్నుమూశారు. వారు లేరనే విషయం తెలిస్తే సహర్ష తట్టుకోలేడని రాజీవ్‌... ఈ సంగతీ చెప్పలేదు. ఇప్పటికీ ఇంట్లో అయిదుగురు చనిపోయారనే విషయం బాలుడికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

స్పందించిన ఎంపీ మార్గాని భరత్

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజీవ్‌.. ‘వర్క్‌ ఫ్రం హోం’ వల్ల కొన్నాళ్లుగా ఇక్కడే ఉన్నారు. ఇంతలో కరోనాకు ఆయన కుటుంబం కకావికలం అయ్యింది. మరోవైపు.. సహర్షకు టీవీ చూసే అలవాటు లేకపోవడం, ఇతరుల నుంచి అమ్మానాన్న విషయాలేవీ తెలియకపోవడంపై అతను ఏం ఆలోచిస్తున్నాడన్నదీ అర్థం కాకుండా ఉంది.

విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ శనివారం రోజున వాళ్లింటికి వెళ్లారు. రాజీవ్‌ను పరామర్శించారు. సహర్షతో కాసేపు మాట్లాడి, అతనితో క్రికెట్‌ ఆడారు. బాలుడికి ఎంపీ కోటాలో కేంద్రీయ విద్యాలయంలో సీటు ఇప్పించి, చదువుకోవడానికి సహకరిస్తానన్నారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చేస్తానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details