మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారంటూ సీబీఐ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు (పీఏలు) రాఘవరెడ్డి, రమణారెడ్డి, అప్పటి సాక్షి పత్రిక జిల్లా విలేకరి బాలకృష్ణారెడ్డిని ఆరా తీశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా సమాచారం అందించారని రాఘవరెడ్డిని అడిగినట్లు తెలిసింది. ఎంపీ పీఏలు ఇద్దరిని మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సీబీఐ అధికారులు విచారించారు.
వివేకా హత్యకు వాడిన మారణాయుధాలను పడేసినట్లుగా అనుమానిస్తున్న రెండు ప్రాంతాల్లో వెలికితీత చర్యలను సీబీఐ అధికారులు మంగళవారం తాత్కాలికంగా నిలిపేశారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సీబీఐ అధికారులు మంగళవారం 12 మందిని విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల పట్టణ సీఐగా పనిచేసిన శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డిని ప్రశ్నించారు. శంకరయ్య హత్యాస్థలంలో ఉండగానే రక్తపుమరకలు, ఇతర సాక్ష్యాధారాలను తుడిచేశారనే అభియోగాలపై ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు.