తెలంగాణ

telangana

ETV Bharat / city

RRR ticket price in AP : పేదోడికి అందుబాటులో వినోదం అంటూనే.. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం

RRR ticket price in AP : పేదోడికి వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే సినిమా టికెట్‌ ధరల్ని తగ్గించామన్న వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు పేదోడిపైనే అధిక భారం మోపింది. రూ.20గా ఉన్న కనీస టికెట్‌ ధరను.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం రూ.95కు పెంచింది.

RRR ticket price in AP
RRR ticket price in AP

By

Published : Mar 20, 2022, 9:40 AM IST

పేదోడికి అందుబాటులో వినోదం అంటూనే ..

RRR ticket price in AP : పేదోడికి వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే సినిమా టికెట్‌ ధరల్ని తగ్గించామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు అదే పేదోడిపైనే అత్యధికంగా భారం మోపింది. రాష్ట్రంలోని థియేటర్లలో ప్రస్తుతం రూ.20గా ఉన్న కనీస టికెట్‌ ధరను.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం రూ.95కు పెంచింది. ప్రస్తుత ధర కన్నా ఇది 4.75 రెట్లు ఎక్కువ. ఈ నెల 7వ తేదీ కంటే ముందు అమల్లో ఉన్న ధరల ప్రకారం రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్‌ కనీస ధర రూ.5. దాంతో పోలిస్తే ఏకంగా 19 రెట్లు పెంచినట్లయ్యింది. ఈ నెల 25న విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ను సూపర్‌ హై బడ్జెట్‌ సినిమాగా పరిగణిస్తూ పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల్లో ఏసీ, నాన్‌ ఏసీ, ప్రత్యేక థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం, నాన్‌ ప్రీమియం, రెగ్యులర్‌, రిక్లెయినర్‌లు అని తేడా లేకుండా అన్ని తరగతులు, అన్ని విభాగాల్లో గంపగుత్తగా ప్రస్తుతమున్న ఒక్కో టికెట్‌ ధరపై అదనంగా రూ.75 చొప్పున పెంచుకునేందుకు అనుమతిచ్చింది. విడుదలైన పది రోజులపాటు ఈ అదనపు ధరలు వసూలు చేసుకోవచ్చంటూ ఈ నెల 17న హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. దాని ప్రకారం చూస్తే పేదలకు అందుబాటులో ఉండే నాన్‌ ప్రీమియం విభాగంపైనే అత్యధిక భారం పడింది. పేదోడికి అందుబాటులో వినోదం ఉంచటమంటే ఇదేనా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

వారం క్రితమే జీవో

Movie Ticket Price Issue in AP : ఎక్కువ ధరకు టికెట్‌ కొనుక్కుని సినిమా చూడలేని వారికోసం ప్రతి థియేటర్‌లోనూ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను నాన్‌ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఈనెల 7న జారీ చేసిన జీవో 13లో ప్రభుత్వం పేర్కొంది. దానిప్రకారం నాన్‌ ప్రీమియం కేటగిరీ అంటేనే పేదలని చెబుతోంది. మరి ప్రీమియం విభాగాలతో సమానంగా వారిపైన కూడా అదనపు టికెట్‌ భారం మోపడమేమిటి? అది కూడా విడుదల తేదీ నుంచి పది రోజులపాటు అదనపు ధరలు వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పించటమేంటి? అంటే ఆ వ్యవధిలో పేదోడికి సినిమా చూసే అవకాశం ఉండొద్దా? పేదవాడికి అందుబాటులో వినోదం అనేదే.. ప్రభుత్వ లక్ష్యమైతే వారు ఎక్కువగా వెళ్లే నాన్‌ ఏసీ, నాన్‌ ప్రీమియం కేటగిరీల్లో టికెట్‌ ధరలు అదనంగా పెంచేందుకు అనుమతే ఇవ్వకూడదు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది.

తెలంగాణలో నాన్‌ఏసీ థియేటర్లలో పెంపులేదే

Cinema Ticket Price Issue in AP : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. అయితే అక్కడ అన్ని కేటగిరీల్లోనూ గంపగుత్తగా పెంచుకోవడానికి అవకాశమివ్వలేదు. ఏసీ థియేటర్లలో సినిమా విడుదలైన తొలి మూడు రోజులపాటు రూ.50 చొప్పున, ఆ తర్వాత వారం రోజులు రూ.30 చొప్పున పెంచుకునేందుకే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్‌లు, అతి పెద్ద స్క్రీన్లున్న థియేటర్లలో తొలి మూడు రోజులపాటు రూ.100 చొప్పున, తర్వాత వారం రోజులు రూ.50 చొప్పున అదనంగా పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పేదలు ఎక్కువగా వెళ్లే నాన్‌ ఏసీ థియేటర్లలో ప్రస్తుతమున్న రేట్లే కొనసాగించాలని పేర్కొంది.

ఏపీలో పేదలపై టికెట్‌ భారం ఇలా..

  • ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ కనీస ధర రూ.20 (గ్రామ, నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ, నాన్‌ ప్రీమియం కేటగిరిలో). దానిపై అదనంగా రూ.75 వసూలు చేసుకుంటే రూ.95 అవుతుంది. అంటే ప్రస్తుత ధరపై 4.75 రెట్లు అదనంగా భారం పడింది.
  • రాష్ట్రంలో సినిమా టికెట్‌ గరిష్ఠ ధర రూ.250 (మల్టీఫ్లెక్స్‌ల్లో రిక్లెయినర్‌ సీట్లకు). దానిపై అదనంగా రూ.75 వసూలు చేసుకుంటే రూ.325 అవుతుంది. ప్రస్తుత ధరపై 1.3 రెట్లు అదనం.
  • దీన్ని బట్టి చూస్తే టికెట్‌ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించగలిగేవారిపై తక్కువ భారం.. అంత స్థోమత లేని వారిపై ఎక్కువ భారం ప్రభుత్వం వేసింది.
  • ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం నిర్దేశించిన అదనపు ధరల్ని కలిపితే నాన్‌ ఏసీ, నాన్‌ ప్రీమియం విభాగాల్లో టికెట్‌ ధరలు అధికంగా పెరగ్గా.. ఏసీ, ప్రీమియం విభాగాల్లో టికెట్‌ ధరలు తక్కువగా పెరిగాయి.
  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, నాయకులు చెప్పినట్లు పేదలకు అందుబాటులో వినోదం అందించేందుకే టికెట్‌ ధర తగ్గించి ఉంటే.. ఇప్పుడు వారిపై అదనపు భారం లేకుండా చూడాలి. కానీ వారిపైనే ఎక్కువ భారం మోపడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details