తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2022, 4:42 PM IST

ETV Bharat / city

''రాధేశ్యామ్​' నన్నెంతో కదిలించింది.. ఆ సన్నివేశాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయి'

Mouth Artist Swapnika About Radheshyam: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'రాధేశ్యామ్​' చిత్రంపై ప్రేక్షకుల్లో మిక్స్​డ్​ టాక్​ నడుస్తోన్నా.. పలువురి మనసులు గెలుచుకోవటంలో విజయవంతమైంది. అందులో ఓ సన్నివేశం తన జీవితానికి దగ్గరగా ఉందంటూ.. ప్రముఖ మౌత్​ ఆర్టిస్ట్​ స్వప్నిక ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఓ సన్నివేశం పెట్టి తనలాంటి వాళ్లకు స్ఫూర్తినిచ్చినందుకు దర్శకున్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Mouth Artist Swapnika met radheshyam movie director Radhakrishna
Mouth Artist Swapnika met radheshyam movie director Radhakrishna

''రాధేశ్యామ్​' నన్నెంతో కదిలించింది.. ఆ సన్నివేశాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయి'

Mouth Artist Swapnika About Radheshyam: ఒక సినిమా.. దానిపై పెట్టిన పెట్టుబడి కంటే రెండింతల కలెక్షన్​లు రాబడితేనో.. అవార్డులు అందుకుంటేనో సక్సెస్​ అయినట్టు కాదు.. అందులోని ఒక్క సన్నివేశమైనా.. పది మందిలో స్ఫూర్తి నింపి వాళ్లలో మార్పు తీసుకొచ్చినప్పుడే ఆ సినిమా పరిపూర్ణమైన విజయం సాధించినట్టు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్​పై మిక్స్​డ్​ టాక్​ నడుస్తోన్నా.. పరిపూర్ణమైన విజయం సాధించినట్టే..? ఎందుకంటే..

మనిషి రాత చేతుల్లో కాదు.. చేతల్లో ఉండాలంటూ సందేశాన్ని చాటిన ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రం.. కమర్షియల్​గా ఎలా ఉన్నా అందులోని ఎమోషన్​ మాత్రం చాలా మందిలో స్ఫూర్తి నింపుతోంది. వందల కోట్ల బడ్జెట్​.. పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​.. విధికి ప్రేమకు మధ్య యుద్ధం.. ఇవన్నింటిని మించి మన రాతను మనమే రాసుకోవాలి.. మన లక్ష్యం కోసం విధినైనా ఎదురించాలని చెప్పే సన్నివేశాలు పలువురిని కదిలిస్తున్నాయి. ఆ మాటలకు నిలువెత్తు సాక్షమైన.. ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నికనూ ఆ సన్నివేశాలు కదిలించాయి. తన జీవితానికి దగ్గరగా ఉండే పలు సన్నివేశాలు సినిమాలో ఉండటం యాదృశ్చికమే అయినా.. తనలో మరింత స్ఫూర్తి నింపాయని స్వప్నిక తెలిపింది.

సినిమా చూసి చాలా కనెక్టయ్యా..

సినిమా చూసి తాను పొందిన అనుభూతిని పంచుకునేందుకు ఆ చిత్ర డైరెక్టర్ రాధాకృష్ణకుమార్​ను స్వప్నిక కలిసింది. ఈ మేరకు రాధేశ్యామ్ కథాంశానికి అద్దంపట్టేలా నోటితో వేసిన పెయింటింగ్​ను రాధాకృష్ణను అందజేసింది. తనలాంటి వారికి స్ఫూర్తినిచ్చే సన్నివేశాలను సినిమాలో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు మరిన్ని సినిమాల్లో పెట్టాలని.. తద్వారా ఎంతో మంది ఇన్​స్పైర్​ కావాలని స్వప్నిక కోరుకుంది.

"రాధేశ్యామ్​ సినిమాలో నాకు ఒక సన్నివేశం చాలా బాగా నచ్చింది. ఒక అమ్మాయి ప్రమాదంలో చేయి కోల్పోవటం.. తర్వాత కూడా తన లక్ష్యం కోసం కష్టపడటం.. ఇదంతా చాలా స్ఫూర్తినిచ్చింది. మాకు చేతులు లేవు, గీతలు లేవు. మా తలరాతను మేమే రాసుకుంటున్నాం. మా లక్ష్యాలను ఛేదించేందుకు ఎన్ని యుద్ధాలైన చేస్తాం. అలాంటి ఓ సన్నివేశం సినిమాలో చూసి.. చాలా కనెక్ట్​ అయ్యాను."- స్వప్నిక, ప్రముఖ మౌత్​ ఆర్టిస్ట్​

జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం..

రాధేశ్యామ్ చిత్రం స్వప్నిక లాంటి అమ్మాయిలను కదిలించడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. స్వప్నిక మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. దివ్యాంగురాలైనా తన స్వశక్తిపై ఆధారపడి విజయాలు సాధించడాన్ని ప్రశంసించారు. స్వప్నికకు తన వంతు సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు.

"మనకు అన్నీ బాగున్నా.. మన ఆలోచనలే మనకు అడ్డుపడుతుంటాయి. అలాంటిది.. నోటితో పెయింటిగ్​ వేయటం.. పెద్ద పెయింటర్​ అవ్వలన్న లక్ష్యం ఉండటం చాలా గొప్ప విషయం. స్వప్నిక చాలా ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఆమె మీద మేం సినిమా తీసేంత గొప్ప స్థాయికి స్వప్నిక చేరుకోవాలి. మన సినిమా ఒకరిని కదిలించింది. ఒకరికి స్ఫూర్తినిచ్చిందంటే చాలా సంతోషం. ఇంతకంటే గొప్ప విజయం ఇంకోటి లేదు. ఇది జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం." - రాధాకృష్ణ, రాధేశ్యామ్​ డైరెక్టర్​

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details