తెలంగాణ

telangana

ETV Bharat / city

Rare feet: 20 రోజుల్లోనే.. 9 పర్వతాల అధిరోహణ! - mountaineer suresh news

మూడు పూటలా నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లలేని పరిస్థితి. తాను చదివి ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబ కష్టాలు తీరవని తెలిసినా.. చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమైన పర్వతారోహణ కోసం ముందుకు కదిలాడు. కఠోర సాధనతో వరుసపెట్టి పర్వతాలు అధిరోహించి జాతీయ జెండా రెపరెపలాడిస్తున్నాడు. తాజాగా ఒకేసారి 9 పర్వతాలు అధిరోహించి భళా అనిపించాడు ఈ కుర్రాడు.

Mountaineer suresh babu
Mountaineer suresh babu

By

Published : Aug 1, 2021, 6:41 PM IST

20 రోజుల్లోనే.. 9 పర్వతాల అధిరోహణ!

అవలీలగా పర్వతారోహణ చేస్తున్న ఈ యువకుడి పేరు సురేశ్‌బాబు. స్వగ్రామం ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగొండ్ల. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటూ.. సర్కారీ బడుల్లో చదువుకున్నారు. కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలు ఎక్కటం ఇష్టమని..అదే పర్వాతారోహణవైపు అడుగులు వేసేలా చేసిందని సురేశ్‌ తెలిపారు.

అతి పిన్న వయసులోనే..

కళాశాల పెద్దలు, సర్కారు ప్రోత్సాహం తోడవటంతో.. సురేశ్‌బాబు పూర్తిగా కొండలు ఎక్కటంపైనే దృష్టిపెట్టారు. ఎంతటి కఠిన శిక్షణకైనా సిద్ధపడ్డారు. 2017 జూన్‌ ఒకటో తేదీన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. శెభాష్‌ అనిపించుకున్నారు. 2019లో మౌంట్ లోత్ సే పర్వతాన్ని ఎక్కారు. ఇప్పటి వరకు 18 అతిపెద్ద పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా సురేష్​బాబు రికార్డు సాధించారు.

మువ్వన్నెల జెండాను నాలుగు పర్వతాలపై రెపరెపలాడించి.. తెలుగువాడి సత్తాను చాటారు. ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌ బ్రస్‌, నేపాల్‌లోని మానస్‌ శిఖరాలను.. విజయవంతంగా అధిరోహించి.. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన యువకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ మధ్యనే హిమాచల్‌ప్రదేశ్‌లో 20 రోజులు ఉండి.. 9 పర్వతాలు ఎక్కి.. అదరహో అనిపించారు. ఏపీ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ అవార్డుతో సత్కరించింది.

ప్రతికూలతలను తట్టుకొని..

ఎవరెస్టు లాంటి పర్వతాలు ఎక్కుతున్నప్పుడు.. ఆనందం కంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల వాతావరణం, ఆర్థిక ఇబ్బందులు, అంతటి మంచులోనూ బరువులు మోసుకుంటూ ముందుకుసాగటం వంటివి ఉంటాయి. దారిపొడవునా.. తనలానే పర్వాతారోహణ చేస్తూ.. శవాలుగా మారిన వాళ్లు కనిపిస్తుంటే భయం వేస్తుందని.. దాన్ని అధిగమించి మరో అడుగు ముందుకు వేసిన తరుణం ఉద్వేగభరితమైన భావోద్వేగాన్ని ఇస్తుందని చెప్పారు.

ఈ పరిస్థితిల్లోనూ ప్రకృతి నుంచి సాంత్వన లభిస్తుంటుందని తెలిపారు. మందలో ఒకడిగా కాకుండా.. వందలో ఒకడిగా ఉండాలనే ఆశయమే.. తనను ఈ దిశగా నడిపించిందని సురేశ్‌బాబు అంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని స్నేహితులు కాంక్షించారు.

ఇదీచూడండి:RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​

ABOUT THE AUTHOR

...view details