GANJA NEWS: ఏపీలోని రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కొందరు విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నట్లు వచ్చిన కథనాలు ఇటీవల కలకలం రేపాయి. తెలంగాణ కోదాడలో 15 ఏళ్ల బాలుడు గంజాయికి బానిసై ఎంతకూ మారకపోవడంతో బుద్ధి చెప్పాలని భావించిన కన్నతల్లి అతణ్ని స్తంభానికి కట్టేసి మొహానికి కారం పులిమారు. ఇటీవలి కాలంలో గంజాయితో పట్టుబడ్డ నిందితుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. భావితరం గంజాయి ఊబిలో ఎలా కూరుకుపోతోందో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఆల్కహాల్ తరవాత ఎక్కువ మంది గంజాయి వ్యసనపరులుగా మారుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి పదకొండు మందిలో ఒకరు పూర్తిగా దానికి బానిసలైపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. హైదరాబాద్ వంటి నగరాలు, ఇతర పట్టణాల్లోని కళాశాలల్లో చదివే విద్యార్థులు కొందరు చెడు స్నేహాల ఫలితంగా గంజాయికి బానిసలవుతున్నారు. తొలుత ఆ మత్తుకోసం, అనంతరం దాని ద్వారా ధనం సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి రవాణా కేసుల్లో చిక్కి విచారణ ఖైదీలుగా ఉన్న వారిలో 80శాతం పేద, మధ్య తరగతి వర్గాలవారే.
యువకులే పావులు:గతేడాది ఏప్రిల్‌లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులను ఏపీలోని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా తాడేపల్లిలో చదువుతున్నారు. గంజాయికి అలవాటు పడిన ఆ విద్యార్థులు కళాశాల ఫీజులకోసం తల్లిదండ్రులు ఇచ్చిన ధనాన్ని ఖర్చు చేశారు. డబ్బులన్నీ అయిపోయాక అడ్డదారులు తొక్కారు. ఆంధ్రా కశ్మీర్‌గా పేరుపొందిన లంబసింగికి వెళ్ళి గంజాయి కొనుగోలు చేశారు. అందులో కొంత భాగాన్ని వినియోగించి, మిగిలినదాన్ని కళాశాలలో తోటి విద్యార్థులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. అక్కడ సుమారు పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. దాన్ని దేశవ్యాప్తంగా రవాణా చేయడానికి యువతను గంజాయి మాఫియా పావులుగా వాడుకుంటోంది. లంబసింగికి వారాంతాల్లో వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. వారిలో కొందరు గంజాయి అక్రమ రవాణాకు ఒడిగడుతున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్తుండటంతో పోలీసులు అన్నింటినీ తనిఖీ చేయడం లేదు. మరికొందరు స్మగ్లర్లు గంజాయి రవాణాకు విలాసవంతమైన కార్లను వినియోగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే పాత్రధారులే జైలుపాలవుతున్నారు. సూత్రధారులు తమ చేతికి మట్టి అంటకుండా తప్పించుకొంటున్నారు. గతేడాది డిసెంబరునుంచి మూడు నెలల కాలంలో ఒక్క ఏపీలోనే 50 వేల కేజీల గంజాయిని సీజ్ చేసి, 500 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. 1100 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో తమిళనాడుకు చెందినవారు వంద మందికిపైగా ఉన్నారు. 2016 నాటి ఏపీ ప్రభుత్వం మూడు వేల ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసింది.
కొండకోనల్లో గంజాయి సాగును డ్రోన్ల సాయంతో గుర్తించి దాన్ని నివారించే చర్యలు చేపట్టింది. గతేడాది నవంబరులో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమానికి ఏపీ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. ఒడిశాలోని 23 జిల్లాలు, విశాఖపట్నం గ్రామీణంలోని 11 మండలాల్లో గంజాయి సాగు అధికంగా ఉందని గుర్తించారు. 406 బృందాలతో గంజాయి సాగు, రవాణా నిర్మూలనకు అహర్నిశలూ కృషి చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు కనిపించడంలేదు. కొన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది, మరికొందరు అధికారుల సహకారంతోనే సరకు కావాల్సిన చోటుకు చేరుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దానికి ప్రతిఫలంగా గంజాయి మాఫియా నుంచి యంత్రాంగానికి ఖరీదైన బహుమతులు దక్కుతున్నాయి. పట్టుకున్న సరకును పోలీసుస్టేషన్లలో నిల్వ ఉంచినప్పుడు దాన్ని సైతం కొద్ది కొద్దిగా అమ్మేసుకుంటున్న ఖాకీల బాగోతం గతంలో వెలుగుచూసింది. దానివల్ల సీఐ స్థాయి అధికారులు సైతం జైలుపాలైన ఉదంతాలున్నాయి.
ప్రభుత్వాల ఉదాసీనత:గంజాయి సాగును అరికట్టేందుకు గిరిజనులకు స్థానికులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉపాధి మార్గాలను చూపుతామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. గంజాయి సాగు విషయంలో ఆ మాఫియా పెట్టుబడి వ్యయాన్ని భరిస్తోంది. విశాఖ మన్యంలో కొన్నిచోట్ల గంజాయి తోటలకు డ్రిప్ ఇరిగేషన్ తరహాలో నీటి వసతి కల్పించారు. వాటికి అవసరమైన ఎరువులనూ మాఫియా సరఫరా చేస్తోంది. సరకునూ నేరుగా కొనుగోలుచేస్తోంది. ఇతర పంటలను సాగుచేసిన గిరిజనులు ఆ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తీసుకెళ్ళి విక్రయించలేక, దళారులు చెప్పిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. ఈ దుస్థితిలో మార్పు రానంత కాలం గంజాయి సాగు కొనసాగుతూనే ఉంటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కుండ బద్దలుకొడుతున్నాయి. మొదట గంజాయి సాగును నిర్మూలించకుండా ఆ మత్తుకు ప్రజలు బానిసలు కావడాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఈ విషయంలో ప్రభుత్వాల ఉపేక్ష భావితరాలకు శాపంగా మారుతోంది. గంజాయిని సమాజం నుంచి తరిమేయడంలో పాలకులు, అధికారుల చిత్తశుద్ధి కీలకం.
ఇదీ చదవండి:శంషాబాద్ విమానాశ్రయంలో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత